ఇప్పుడు రైల్వే స్టేషన్ లో చెత్త వేయండి..చూస్తాం..
By రాణి Published on 8 Feb 2020 5:53 AM GMTముఖ్యాంశాలు
- జాగ్రత్త సుమీ..స్టేషన్ లో ఉమ్మినా..చెత్తేసినా జరిమానాలే..
- స్టేషన్లను శుభ్రంగా ఉంచేందుకు రైల్వేశాఖ కొత్త నిర్ణయం
- ఉమ్మితే రూ.200 నుంచి రూ.300 జరిమానా
- చెత్త వేస్తే రూ.100 నుంచి రూ.200..
- మూత్ర విసర్జన చేస్తే రూ.300 - రూ.400..
- స్వచ్ఛ రైల్వే స్టేషన్లు
ఇప్పుడు మన స్టేషన్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసుగా..ఎక్కపడితే అక్కడ చెత్త వేయడం, ఉమ్మేయడం..చిన్నపిల్లలుంటే సరేసరి. వారి అవసరాలను తీర్చేందుకు స్టేషన్లలో బాత్రూమ్ లు ఉండనే ఉన్నాయి. కానీ వాటిని వాడరు సరికదా. ఫ్లాట్ ఫామ్ మీది నుంచి ట్రాక్ మీదికి దింపి పని కానియ్యమని చెప్తుంటారు తల్లిదండ్రులు. మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా ? ఇలాంటి పద్ధతులను మార్చి, స్టేషన్లను స్వచ్ఛ స్టేషన్లుగా ఉంచాలనే.. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఎవరైనా కావాలని చెత్తవేసినా, మూత్రం పోసినా, గోడలను పాడుచేసినా ఉపేక్షించకూడదని సంబంధిత స్టేషన్ల అధికారులకు తెలిపింది. ఇలాంటి పనులు చేస్తున్న వారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగో చేపడుతున్న ఈ కార్యక్రమం రాష్ర్టంలోని అన్ని డివిజన్లలోనూ అమలవుతుందని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. అలాగే స్టేషన్ కేటగిరీ బట్టి జరిమానాల వసూళ్లుంటాయని, స్టేషన్ మేనేజర్లు, సూపరింటెండెంట్లు, కమర్షియల్, ఆపరేషనల్ విభాగాల్లో టిక్కెట్ కలెక్టర్, ఆపై స్థాయి అధికారులు, గజిటెడ్ అధికారులు, ఆర్‌పీఎఫ్ అధికారులు జరిమానా విధించవచ్చనని తెలిపింది.
కాగా..ఈ జరిమానాలను విధించడం కొత్తేం కాకపోయినా..గతంలో ఇవి కేవలం ఏ-1, ఏ కేటగిరీ స్టేషన్లకే పరిమితమయ్యాయి. వాటిలో కూడా అప్పుడప్పుడూ ఎప్పుడోకసారి జరిమానాలు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు సబర్బన్, నాన్ సబర్బన్, హాల్ట్ స్టేషన్లు అన్నింటిలోను జరిమానాలు వసూలు చేస్తారు. అప్పటికి ఇప్పటికి జరిమానాల్లో కొంత మార్పు చేశారు. 2017-18లో 9,301 మంది నుంచి జరిమానాలు వసూలు చేయగా, 2018-19లో వారి సంఖ్య 10,582కి చేరింది. 2019లో డిసెంబరు వరకు 8,231 మంది నుంచి వసూలు చేశారు.
చెత్తా చెదారం వేస్తే... రూ.100 నుంచి రూ.200
వంట చేస్తే రూ.500
ఉమ్మితే..రూ.200 నుంచి రూ.300
మూత్రం పోస్తే..రూ.300 నుంచి రూ.400
పక్షులు, జంతువుల ఆహారం వెదజల్లితే రూ.300 నుంచి రూ.500
పాత్రలు కడిగినా, దుస్తులు ఉతికినా రూ.300 నుంచి రూ.500
రైల్వే ఆవరణలో అనుమతి లేని నిల్వలు చేస్తే రూ.5,000
అనుమతి లేకుండా పోస్టర్లు అతికిస్తే...రూ.1,000 నుంచి రూ.2,000
అమ్మకందారులు డ్రై, వెట్ వేస్ట్‌లకు వేర్వేరు బిన్లు పెట్టకపోతే...రూ.1000 నుంచి రూ.2 వేలు.
50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ ఉపయోగిస్తే...రూ.300 నుంచి రూ.500