శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  1 Sept 2020 7:46 AM IST
శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు

టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీలో ఉద్యమకారులను కలుపుకొని వెళ్లడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి విమర్శించిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు ఉందని ఆయన వాపోయారు. గత కొంత కాలంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నా.. ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. అయితే నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. నేను పార్టీ మారే ఆలోచన లేదు అని స్వామిగౌడ్‌ అన్నారు. ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గతంలో కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

కాగా, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. అయినా చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. కనీసం ఏదైనా పదవి దక్కుతుందని ఆశించినా.. భంగపాటు తప్పకపోవడంతో స్వామిగౌడ్‌ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీకాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్‌ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో అంతగా కనిపించడం లేదు.

Next Story