ఆ 40 ప్రదేశాలకు కరోనా వ్యాపించిందా..!

By అంజి  Published on  4 April 2020 3:24 AM GMT
ఆ 40 ప్రదేశాలకు కరోనా వ్యాపించిందా..!

'కరోనావైరస్: ఇప్పటికీ కోవిడ్-19 కేసులు నమోదు కాని దేశాలివే' అంటూ బీబీసీ తెలుగు కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. మహమ్మారి కరోనా వైరస్‌ ఇప్పటికే 181పైగా దేశాల్లో విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10.68 లక్షలు దాటింది. ఇక మృతుల సంఖ్య 53 వేలు దాటింది. 2 లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, స్పెయిన్‌ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అయితే 40 ప్రదేశాల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని బీబీసీ తన కథనంలో రాసింది.

ఇదిలా ఉంటే తుర్కెమినస్థాన్‌ దేశ ప్రభుత్వం కరోనా వైరస్‌ అనే పదాన్ని నిషేధించింది. ఆ పదాన్ని వాడిన, మాట్లాడిన కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖానికి మాస్క్‌ ధరించిన పోలీసులు అరెస్ట్‌ చేస్తారంటూ అక్కడి స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా యమెన్‌ దేశం కుదేలైంది. ఆ దేశంలో కూడా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని తెలిసింది. ఇక అంటార్కిటికాలో కూడా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. నిజం చెప్పాలంటే.. అక్కడ మనుషులు ఎవరూ నివసించడం లేదు.

జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ సేకరించిన తాజా గణాంకాల ప్రకారం.. 181 దేశాల్లో కరోనా కేసులు నిర్దారణ అయ్యాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో 40 ప్రాంతాల్లో కనీసం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ ప్రాంతాల్లో జానాభా తక్కువ, ప్రజల రాకపోకలు తక్కువ కావడమే.. కరోనా వైరస్‌ కేసులు నిర్దారణ కాకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఏప్రిల్‌ 1 నాటికి పసిఫిక్‌ ద్వీపాలు, తుర్కెమెనిస్తాన్‌ దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు తగ్గిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు విమాన సర్వీసులపై ఆంక్షలు విధించారు.

అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా బయటి ప్రపంచానికి అంత సులువుగా తెలియదు. కరోనా వైరస్‌ విషయంలో ఉత్తర కొరియా దేశ ప్రభుత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరకొరియా చైనా పొరుగు దేశం. చైనా సరిహద్దులు పంచుకున్న దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభించింది. కాని ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయన్న వివరాలు బయటకు రాలేదు.

Next Story