బాబోయ్.. సుశాంత్‌పై ఇంత ప్రేమా
By సుభాష్ Published on 7 July 2020 3:11 PM ISTచనిపోవడానికి ముందు కంటే ఇప్పుడు పెద్ద స్టార్‌గా కనిపిస్తున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అతడిపై ప్రేక్షకుల్లో ఎంత ప్రేమ ఉందో.. అతడికి ఎంత భారీ ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. మరణానంతరం సుశాంత్ ఫాలోయింగ్ ఎంతగానో పెరిగిందని స్పష్టమవుతోంది. ఎందుకంటే అతడి చివరి సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. యూట్యూబ్‌లో సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా.. వాటిని మించి సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచరా’ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ‘దిల్ బేచరా’ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ రోజు ఉదయానికే 20 మిలియన్ మార్కును దాటేసింది. మధ్యాహ్నానికి ఈ ట్రైలర్ వ్యూస్ 2.4 కోట్లకు చేరువగా ఉన్నాయి. ఇండియాలో ఇంత వేగంగా 2 మిలియన్ మార్కును అందుకున్న ట్రైలరే లేదు. ‘బాహుబలి’కి సైతం ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ రాలేదు.
ఇక లైక్స్ విషయంలో ‘దిల్ బేచరా’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 53 లక్షల లైక్స్ వచ్చాయి ఈ చిత్రానికి. మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు వాళ్ల అభిమానులు పనిగట్టుకుని వ్యూస్ తెచ్చిపెడుతుంటారు. లైక్స్ కొడుతుంటారు. కానీ సుశాంత్ అలాంటి హీరో కాదు. అతడి మీద ప్రేమతోనే స్వచ్ఛందంగా ప్రేక్షకులు వ్యూస్, లైక్స్ రికార్డులు కట్టబెట్టారు. సుశాంత్ చివరి సినిమా అన్న ఆసక్తిని పక్కన పెడితే.. ‘దిల్ బేచరా’ ట్రైలర్ మామూలుగా కూడా బాగుంది. మనసును మెలిపెట్టే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. కచ్చితంగా మంచి ఫలితాన్నందుకుంటుందనే అనిపిస్తోంది. ‘ది ఫాల్ట్స్ ఇన్ అవర్ స్టార్స్’ అనే అమెరికా నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ మూవీకి ‘దిల్ బేచరా’ రీమేక్. సుశాంత్ స్నేహితుడైన ముకేష్ చబ్రా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా హీరోయిన్ సంజన సంఘి కూడా కొత్తమ్మాయే. ఫాక్స్ స్టార్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న డిస్నీ-హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. సబ్ స్క్రైబర్లే కాకుండా ఎవ్వరైనా ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు.