పరుచూరి బ్రదర్స్ పై డైరెక్టర్ సురేందర్ రెడ్డి కామెంట్స్..ఇంతకీ ఏంటా కామెంట్స్..?
By న్యూస్‌మీటర్ తెలుగు
మెగాస్టార్ చిరంజీవి తాజా సంచలనం 'సైరా నరసింహారెడ్డి'. చిరంజీవి ఈ సినిమా చేయాలని సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే... ఇన్నాళ్లకు కుదిరింది. ఇంకా చెప్పాలంటే... సైరా నరసింహారెడ్డి పరుచూరి బద్రర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. వీళ్లు చెప్పిన కథ చిరుకు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం... రామ్ చరణ్ భారీ స్ధాయిలో నిర్మించడం తెలిసిందే. ఈ కథకు సురేందర్ రెడ్డి అయితే... న్యాయం చేస్తాడని.. చిరు, చరణ్ భావించి ఆయనకు అవకాశం ఇచ్చారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'సైరా నరసింహరెడ్డి 'ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే... ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.... పరుచూరి బ్రదర్స్ రాసిన 'సైరా' స్క్రిప్ట్ ని తానూ తీసుకోలేదన్నారు. తాను మిగిలిన రచయితల సాయంతో నరసింహారెడ్డి జీవితం పై ఎంతో రీసెర్చ్ చేసి 'సైరా' కొత్త స్క్రిప్ట్ ను రాసుకున్నానని చెప్పాడు. ఆ స్క్రిప్ట్ నే సినిమాగా మలిచానని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు.
సురేందర్ రెడ్డి చెప్పిన ఈ మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పరుచూరి బ్రదర్స్ పదేళ్లుగా ఎంతో ప్రేమించి రాసిన కథను అసలు తీసుకోలేదని సురేందర్ రెడ్డి అనడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో సురేందర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యల పై పరుచూరి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.