అయోధ్య రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
By రాణి
న్యూఢిల్లి : అయోధ్య కేసులో నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ దాఖలైన 18 పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చెప్పిన తీర్పులో మార్పులుండవని సీజేఐ జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు.
అయోధ్యలో రామమందిరం కట్టాలా ? బాబ్రీ మసీదును ఉంచాలా ? అన్న దానిపై చాలా ఏళ్లకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. నవంబర్ 9న వచ్చిన ఈ తీర్పు హిందువులకు అనుకూలంగా ఇచ్చారని, ఆ తీర్పుపై మరొకసారి రివ్యూ చేయాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటన్నింటినీ తోసిపుచ్చింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రాములవారికే చెందుతుందని సుప్రీం తీర్పులో పేర్కొంది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. అయితే బాబ్రీ మసీదు నిర్మించేందుకు అయోధ్యలోనే మరొక ప్రదేశంలో ఐదెకరాల భూమిని కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది.