దిశ కేసు.. అప్పటి వరకు ఆ కమిషన్‌కే చెప్పుకోవాలన్న సుప్రీంకోర్టు

By అంజి  Published on  28 Feb 2020 9:40 AM GMT
దిశ కేసు.. అప్పటి వరకు ఆ కమిషన్‌కే చెప్పుకోవాలన్న సుప్రీంకోర్టు

ముఖ్యాంశాలు

  • ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ వేశామన్న సీజేఐ బాబ్డే
  • ఈ పిటిషన్‌ను విచారించలేమని చెప్పిన సుప్రీంకోర్టు
  • ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు చెప్పాలని సూచన
  • పిటిషన్‌ ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చిన కోర్టు

ఢిల్లీ: దిశ నిందితుల కుటుంబాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. శుక్రవారం విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఏ బాబ్డే నేతృత్వంలోని.. ఈ పిటిషన్‌ను విచారించలేమని చెప్పింది. ఇప్పటికే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ కమిషన్‌ వేశామని సీజేఐ బాబ్డే పేర్కొన్నారు. ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు చెప్పాలని ధర్మాసనం సూచించింది. కాగా పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. కాగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ నిందితుల కుటుంబాలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. న్యాయ విచారణ కమిషన్‌ను దిశ నిందితుల కుటుంబాలు కలిసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్రత కూడా కల్పించింది. ఇదే సందర్భంలో ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే.. తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని సీజే ధర్మాసనం తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ సూచనతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు న్యాయవాది తెలిపారు.

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. డిసెంబర్‌ 6వ తేదీన నిందితులతో పోలీసులు సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా.. నిందితులు పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.

దిశ కేసులో న్యాయ విచారణ కమిషన్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. మిషన్‌లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్‌కర్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌లు ఉన్నారు.

Next Story