హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
By సుభాష్ Published on 28 Oct 2020 8:12 AM GMTప్లే ఆఫ్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. గత మ్యాచ్‌లో 127 పరుగులు చేధించకలేక
చతికిల పడ్డ హైదరాబాద్.. ఢిల్లీపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముందుగా బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ.. అనంతరం
బౌలింగ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని గడగడలాడించింది. మొత్తానికి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించింది. మంగళవారం జరిగిన ఈ చావోరేవో మ్యాచ్‌లో హైదరాబాద్ 88 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 12 మ్యాచుల్లో సన్‌రైజర్స్‌కు ఇది అయిదో విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 87; 12
ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. మనీశ్ పాండే (31
బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. రిషభ్ పంత్(36),
రహానే(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్(3/7) మూడు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ(2/27), నటరాజన్
(2/26) రెండేసి వికెట్లు తీశారు. నదీమ్, హోల్డర్, శంకర్‌కు తలో వికెట్ దక్కింది.
తన పుట్టిన రోజైన మంగళవారం వార్నర్ చెలరేగిపోయాడు. అశ్విన్ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్‌తో అతని జోరు మొదలైంది. తర్వాత
నోర్జే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్... రబడ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా 22 పరుగులు (4, 4, 0, 6, 4, 4) సాధించి వేడుక
చేసుకున్నాడు. వార్నర్‌కు వికెట్ కీపర్ సాహా తోడయ్యాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ స్కోరు 77 పరుగులకు చేరింది. ఈ సీజన్‌లో ఏ
జట్టుకైనా పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో వార్నర్ 25 బంతుల్లో అర్థసెంచరీ చేసిన ఈ ఆసీస్ ఆటగాడు ఈ సీజన్‌లో
పవర్ ప్లే లోపలే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వార్నర్ పెవిలియన్ చేరాక.. సాహా ధాటిగా ఆడాడు. ముఖ్యంగా రబాడ
బౌలింగ్‌లో కొట్టిన పుల్ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్. ఈ క్రమంలో 27 బంతుల్లో అర్థసెంచరీ మార్కు చేరుకున్న అతను.. ఆ తరువాత మరింత ధాటిగా
ఆడాడు. శతకం సాధించేలా కనిపించినా.. నార్జ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆ తరువాత ఢిల్లీ బౌలర్లు
పుంజుకోవడంతో.. 250 పరుగులు చేసేలా కనిపించిన హైదరాబాద్.. చివరి అయిదు ఓవర్లలో కేవలం 44 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో దూకుడు కనిపించలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరగడంతో జట్టు
పతనం మొదలైంది. రషీద్ తన తొలి ఓవర్లోనే స్టొయినిస్ (5), హెట్‌మైర్ (16)లను అవుట్ చేశాడు. ఓపెనర్ రహానే (26; 3 ఫోర్లు, 1 సిక్స్)
ఎక్కువసేపు నిలువలేదు. కెప్టెన్ అయ్యర్ (7) వైఫల్యంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు.
నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసిన రషీద్.. 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది అతనికి అత్యుత్తం. ఇందులో 17 డాట్ బాల్స్ ఉన్నాయి.