ముఖ్యాంశాలు

  • తీహార్ జైలు అధికారి మనోభావాలతో పుస్తకం
  • తన కెరీర్ అనుభవాలతో పుస్తకం రాసిన గుప్తా
  • తీహార్ జైల్లో 35 సంవత్సరాలకు పైబడిన గుప్తా కెరీర్
  • బిల్లారంగాల ఉరిశిక్షలకు గుప్తా ప్రత్యక్ష సాక్షి
  • అప్జల్ గురు ఉరిశిక్షకు గుప్తా ప్రత్యక్ష సాక్షి

కొందరు పాటలు పాడుకుంటారు. కొందరు హాయిగా తిని పడుకుని కంటినిండా నిద్రపోతారు. కొందరు మాత్రం తమకు అన్యాయంగా శిక్ష వేశారంటూ జైలు గోడలు దద్దరిల్లేట్టుగా పెడబొబ్బలు పెడతారు. సరిగ్గా ఉరి శిక్ష అమలుకు 24 గంటలు సమయం ఉందనగా ఇలాంటి ఎన్నో సందర్భాలను, ప్రవర్తనలను చూశారు రిటైర్డ్ లీగల్ ఆఫీసర్ సునీల్ గుప్తా ఢిల్లీలోని తీహార్ జైల్లో. ఖైదీలకు ఉరి శిక్షను ఎలా అమలు చేస్తారు. ఆ సమయంలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాలను వివరిస్తూ ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇప్పుడు బాగా పాపుల్ అయ్యింది.

జైల్లో ఉరిశిక్షను అమలు చేయించే అధికారిగా ఆయన ఇలాంటి ఎన్నో కేసుల్ని చూశారు. 1982లో కరుడుగట్టిన నేరస్తులు బిల్లా రంగాలకు మరణ శిక్షను అమలు చేసే ముందురోజున జైలు అధికారిగా ఉన్న సునీల్ గుప్తాకు నోటికి ముద్దగిట్టలేదు. మెతుకు సహించలేదు. ఎంతో అంతర్మథనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆయన గుండె నిబ్బరంతో చేయాల్సిన పని చేసేశారు.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నిర్భయ హత్య కేసులో నిందితులైన దోషులకు ఆయన ఆధ్వర్యంలోనే ఉరి శిక్షను అమలు చేయాల్సి వచ్చింది. తన 35 సంవత్సరాల కెరీర్ లో తీహార్ జైల్లో ఎంతోమంది నేరస్తులను చూసిన గుప్తా మళ్లీ ఇన్నేళ్లకు నిర్భయ హత్య కేసు నేరస్తులకు ఉరి శిక్ష అమలు విషయంలో అలాంటి కరుడుగట్టిన నేరస్తులను చూశానని చెబుతున్నారు.

ఖైదీల గందరగోళం..

1978లో బిల్లా రంగా ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి, మానభగం చేసి అత్యంత పాశవికంగా హత్య చేసినట్టు విచారణలో తేలింది. సరిగ్గా అలాగే నిర్భయ హత్యకేసులో కూడా జరిగింది. నిర్భయ హత్యకేసులో బాధితురాలితోపాటుగా 14 సంవత్సరాల ఆమె సోదరుడికికూడా నిందితులు తమ కారులో లిఫ్ట్ ఇచ్చారు. ఓ తల్వార్ ని చూపించి బాధితురాలి సోదరుడిని అడ్డుకుని, అత్యంత దారుణంగా బాధితురాలిపై అత్యాచారం జరిపిన నిందితులు ఆమెను దారుణంగా పొడిచి హత్య చేశారు.

మొదట బిల్లా రంగా గురించి న్యూస్ పేపర్లలో చదివిన గుప్తా మొదటిసారి వాళ్లను చూసినప్పుడు పెద్దగా తేడాగా ఏం అనిపించలేదట. కానీ ఉరి శిక్ష అమలు కావడానికి ఓ వారం రోజుల ముందు వాళ్లకు తమ బంధువులను కలుసుకోవడానికి, ఆస్తి పాస్తుల వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాళ్లకు జైలు సూపరింటెండెంట్ ఈ సమాచారాన్ని అందజేయాలి.

ఆ వారం రోజులూ రంగాలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఎప్పటిలాగే రంగా ఖుష్ అని కామెంట్ చేస్తూ చాలా సాదాసీదాగా గడిపేశాడట. కానీ బిల్లా మాత్రం ఆ వారం రోజులపాటూ మానసికంగా చాలా ఒత్తిడికి లోనయ్యాడట. కేవలం రంగావల్లే తన జీవితం అలా అయిపోయిందనీ, రంగాతో కలిసి నేరం చేసినందువల్లే తనకు అర్థంతరంగా చనిపోవాల్సిన పరిస్థితి కలిగిందనీ నిందిస్తూ ఎప్పుడూ ఏడుస్తూ, అరుస్తూ గందరగోళంగా కనిపించేవాడట.

తర్వాత ఖైదీలను డెత్ సెల్ కి మార్చి వారిపై నిఖా ఉంచారు. మొత్తం వాళ్ల సామానంతటినీ తీసేసుకున్నారు. ఆఖరికి పైజమా తాడునుకూడా వాళ్లకు అందుబాటులో లేకుండా చేశారు. కారణం పైజమా తాడుతోకూడా ఖైదీ ఉరేసుకునే ప్రమాదం ఉంటుంది కనుక. తర్వాత ఉరి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.

ముందునుంచే అన్ని జాగ్రత్తలు..

ఖైదీల బరువూ, ఎత్తూ, మెడ కొలతలు తీసుకున్నారు వారికి సరిపోయే ఉరితాడును, కంబాన్ని సిద్ధం చేయడానికి. ఖైదీ బరువు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ ఎత్తునుంచి అతన్ని ఉరి తీస్తారని గుప్తా చెబుతున్నారు. సరిగ్గా పూర్తి స్థాయిలో ప్రొసీజర్ ని ఫాలో అవ్వకపోతే తర్వాత అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ముందునుంచే పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటారు.

ఉరి తాడుకు ముందుగా ఖైదీ బరువుకంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ బరువున్న ఇసుక బస్తాలను వేలాడదీసి దాని సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. ఉరితాడు తెగిపోకుండా చూసేందుకు దానికి వెన్నను, మైనాన్నీ పూస్తారు. బెంగాల్ కి చెందిన నాటా ముల్లిక్ లాంటి తలారులైతే సబ్బును, అరటిపండ్ల గుజ్జును తాడుకు పూస్తారట.

సరిగ్గా ఉరి తీయడానికి ముందురోజు రాత్రి రంగా హాయిగా భోజనం చేసేసి పడుకున్నాడు. కానీ బిల్లా మాత్రం జైలు గోడలు దద్దరిల్లేలా గోలచేసి, గట్టిగా అరిచి, ఏడుస్తూనే ఉన్నాడట. ఉరి తీసే సమయంలోకూడా రంగా తన ఇష్టదైవాన్ని తలచుకుంటూ ప్రాణాలు వదిలేశాడట. కానీ బిల్లామాత్రం గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడట.

తలారిని లీవర్ లాగమని ఎస్పీ ఆదేశం ఇవ్వాలి. ఎర్రటి జేబుగుడ్డను ఊపడం ద్వారా ఎస్పీ ఈ సిగ్నల్ ఇస్తారు. ఉరి శిక్ష అమలైన రెండు గంటల తర్వాత డాక్టర్ ఆ ఖైదీ ఉరిశిక్షవల్ల మరణించాడా లేదా అన్న విషయాన్ని అతని తలను పైకెత్తి రూఢి చేసుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల తర్వాత అలా డాక్టర్ రంగా తలను పైకెత్తి పరీక్షించినప్పుడు రంగా నాడి ఇంకా కొట్టుకుంటూనే ఉందట.

కొన్ని సందర్భాల్లో ఉరి తీసే సమయంలో ఖైదీకి భయంతో ఊపిరి ఆగిపోతుందికానీ, శరీరంలో మాత్రం ప్రవహిస్తూనే ఉండే అవకాశం ఉంటుంది. సరిగ్గా రంగా విషయంలో అదే జరిగి ఉంటుందని గుప్తా అంటున్నారు. డాక్టర్ రంగా దేహాన్ని పరీక్షించిన తర్వాత గార్డ్ ని ఉరికొయ్యకు వేలాడుతున్న రంగా దేహాన్ని పట్టుకుని పదిహేను అడుగుల లోతున్న కూపంలోకి దూకమని ఆదేశిస్తారట. సరిగ్గా గార్డ్ అలా చేసేసరికి రంగా శరీరంలో పల్స్ ఆగిపోయి ఉండొచ్చని గుప్తా చెబుతున్నారు.

గుప్తా తన కెరీర్ లో మొత్తం ఎనిమిది ఉరిశిక్షలకు సాక్షిగా ఉన్నారు. ఖైదీలను ఉరి తీసేసమయంలో తమలోకూడా అంతులేని మానసిక ఉద్వేగాలు కలుగుతాయని ఆయన చెబుతున్నారు.

గుప్తాకి ఇంగ్లీష్‌ నేర్పించిన నిందితుడు మక్బూల్‌..

1984లో ఉరితీయబడిన జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కో ఫౌండర్ మక్బూల్ భట్ అధికారి గుప్తాకి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు సాయం చేశాడట. ఓ ప్రభుత్వ అధికారిని హత్య చేసినందుకు మక్బూల్ కి ఉరి శిక్ష విధించారు. తను బాగా చదువుకున్న, విషపూరితమైన భావాలు కలిగిన మనిషని, ఇంగ్లిష్ అద్భుతంగా మాట్లాడేవాడని గుప్తా చెప్పారు. తరచూ సిబ్బంది అధికారులు ఇచ్చిన మెమోలకు సమాధానాలు అతడ్ని అడిగి రాసుకునేవాళ్లని తెలిపారు. మక్బూల్ ఉరికంబం ఎక్కే రోజున చాలా ప్రశాంతంగా, బ్యాలెన్స్ డ్ గా కనిపించాడట.

ఉరి శిక్ష అమలుకు ముందు ఖైదీలకు చివరి కోరికను తీరుస్తారు. ఒకవేళ ఆ ఖైదీలు తమను ఉరి తీయొద్దని లేదా తమకు మాంసాహార భోజనం కావాలని అడిగితే తీహార్ జైలు అధికారులు ఆ రెండు కోరికలనూ తీర్చడానికి వీల్లేదు. ఎందుకంటే అధికారికంగా ఆ రెండూ సాధ్యం కాని పనులే. తీహార్ జైలు నియమాల ప్రకారం కేవలం అక్కడ శాకాహారం మాత్రమే దొరుకుతుంది.

పార్లమెంట్ పై దాడి చేసిన కేసులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ మహమ్మద్ అప్జల్ గురుని ఉరి తీసే సమయంలో మాత్రం తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని గుప్తా చెప్పారు. ఫిబ్రవరి 9, 2013న అప్జల్ ని డెత్ సెల్ కి తరలించడానికి ముందు ఎస్పీ, అప్జల్ గురు, తను కూర్చుని టీ తాగారట.

ఆ సందర్భంలో అప్జల్ తన కేసు వివరాలను పూర్తిగా వీళ్లిద్దరికీ చెప్పాడట. తను టెర్రరిస్టును కాననీ, సామాన్యులకోసం పోరాటం చేసే ఒక సామాన్యుడిని మాత్రమే అని చెప్పాడట. అప్పుడతను బాదల్ సినిమాలోని అప్నేలియే జియే తో క్యా హై, తు జీ ఆ దిల్ జమానే కేలియే – అనే పాట పాడాడట. అప్జల్ ఆ పాట పాడే సమయంలో గుప్తాకూడా తనతో గొంతు కలిపిన విషయాన్ని తన పుస్తకంలో రాసుకున్నారు. నిర్భయ హంతకుల ఉరి శిక్ష అమలు సందర్భంలో గుప్తా రాసిన పుస్తకం పాపులర్ అయ్యింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.