డిజిటల్ ప్రపంచంపై సుకుమార్ కన్ను..?
By మధుసూదనరావు రామదుర్గం Published on 25 July 2020 6:23 AM GMTటాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న యంగ్ ఎనర్జటిక్ దర్శకుడు సుకుమార్ తీసే ప్రతి సినిమా ఓ ప్రయోగమే! ఆర్య, 100 పర్సెంట్ లవ్, ఒక్కడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్‌లు తన ఖాతాలో ఉన్నాయి. సుకుమార్‌తో సినిమా ఓ కొత్త అనుభూతి అని స్టార్ నటులే అంగీకరిస్తారు. ఈ లెక్కల మాస్టారు ప్రతి సినిమాకు ఓ లెక్క.. ఓ విధానం ఉంటుంది. తను ఏ నిర్ణయం తీసుకున్నా క్యాలిక్యులేటెడ్‌గానే ఉంటుందన్నది వాస్తవం.
ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' చిత్ర నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు . చిత్రం ప్రి–ప్రొడక్షన్ పనులు పూర్తి అయినా.. కరోనా ప్రభావంతో షూటింగ్ వెళ్లడానికి అవాంతరం ఏర్పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో షురూ అవుతున్నట్టు తెలుస్తోంది.
9 ప్రేమ కథలతో సిద్ధం
తాజాగా సుకుమార్ వెబ్ వరల్డ్‌కు మొగ్గు చూపుతున్నట్టు వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మాటలకు బలం చేకూర్చేలా సుకుమార్ 9 విభిన్న ప్రేమ కథలను సిద్ధం చేస్తున్నారు. ఈ విభిన్న ప్రేమ కథలతో ఈ వెబ్‌సీరీస్ ప్రారంభించనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ పనుల్ల బిజీగా ఉన్న సుకుమార్ కొందరు డైరెక్టర్లతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరి సుకుమార్ దర్శకత్వ బాధ్యతలూ వహిస్తాడా.. లేదా కేవలం కథలకే పరిమితమవుతాడా అన్నది తేలాల్సి ఉంది. నిరంతరం కొత్తదనం కోసం అన్వేషించే సుకుమార్ వెబ్‌సీరీస్‌కు సిద్ధమైతే మాత్రం డిజిటల్ ప్రేక్షకులకు పండగే పండగ!!