తమిళనాడులో ఈ నెల 25న ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడు సుజీత్ విల్సన్ కన్నుమూసాడు. అధికారులు నాలుగు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుజీత్ మరణించాడని అధికారులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని వేకువజామున బోరుబావి నుంచి వెలికితీసారు.

శుక్రవారం సాయంత్రం సుమారు 5.30 నిమిషాలకు సుజీత్, తన అన్నయ్యతో కలిసి ఆడుకుంటుండగా బోరుబావిలో పడ్డాడు. ఆ బోరుబావి 600 అడుగుల లోతు ఉంటుంది అని కొందరు అంటే, కొందరు 1000 అడుగులు పైగా ఉంటుందని అంటున్నారు.

మొదట 26 అడుగులలో పడ్డ సుజీత్, సహాయక చర్యలు ప్రారంభం అయ్యాక 87 అడుగుల లోతుకి పడిపోయాడు. అధికారులు సుజీత్ కి ఆక్సిజన్ అందిస్తున్నా శుక్రవారం సాయంత్రం నుంచీ భోజనం, నీరు లేకుండానే ఉన్నాడు.

సుజీత్ తల్లి దర్జీ, తండ్రి నిర్మాణ కార్మికుడు. వారికి ఇద్దరు పిల్లలు, సుజీత్ చిన్నవాడు. ఆ బోరుబావి 7 సంవత్సరాల క్రితం తవ్వింది.

సత్య ప్రియ బి.ఎన్