ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. రాపర్తినగర్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న భీంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సమ్మె నేపథ్యంలో ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర కలత చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకున్నాడు. తండ్రిని కాపాండేందుకు ప్రయత్నించిన కుమారుడికి కూడా గాయాలు అయ్యాయి. తొంభై శాతం కాలిన గాయాలతో ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌ రెడ్డి పరిస్థితి విషమిస్తుడటంతో పోలీసులు హైదరాబాద్ లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. అయితే..యశోధ ఆస్పత్రి వర్గాలు జాయిన్ చేసుకోపోవడంతో..అపోలో కు తరలించారు పోలీసులు.

ఇవాళ ధర్నాలో పాల్గొన్న శ్రీనివాస్‌ రెడ్డి తమకు న్యాయం జరగదేమోనని ఆందోళనకు గురై ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తు కోల్పోయానని ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించినట్టు శ్రీనివాస్‌రెడ్డి ఇంటి చుట్టు పక్కల వాళ్లు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో మరణించారు. మరో వైపు ఎనిమిదో రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేరుకుంది. సమ్మెను తీవ్రతరం చేసేందుకు యూనియన్‌ సంఘాలు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఇదిలా ఉంటే సమ్మె కారణంగా విద్యార్థుల దసరా సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.