సుడాన్ ప్రధానిపై హత్యాయత్నం

By అంజి  Published on  10 March 2020 7:22 AM GMT
సుడాన్ ప్రధానిపై హత్యాయత్నం

సుడాన్‌ ప్రధాని అబ్దల్లా హమ్దోక్‌ బాంబు దాడి నుంచి త్రుటి లో నుంచి తప్పించుకున్నారు. సోమవారం నాడు దేశ రాజధాని కార్టోమ్ లో ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన కారులో ఎవరో బాంబు పెట్టారు. సరిగ్గా ఆయన కారు అక్కడికి వచ్చినప్పుడే బాంబును పేల్చి చంపేయాలని చూశారు. వారు అనుకున్నట్టుగానే బాంబు పేల్చినా.. కొద్దిలో ప్రమాదం తప్పింది. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అక్కడి అధికారులు సైతం ప్రకటించారు. ప్రధాన మంత్రి కారు కొంత దెబ్బతిన్నదని, బాంబు పెట్టిన కారు పూర్తిగా తుక్కుతుక్కుగా మారిందని తెలిపారు. మరో రెండు అధికారిక వాహనాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనేదీ ఏ ఉగ్రవాద సంస్థగానీ, మరెవరుగానీ ఇంకా ప్రకటించలేదని అధికారులు చెబుతున్నారు.

Also Read: అంతరిక్షంలో పంట సాగు.. వ్యోమగాములకు పండగే..!

హామ్దక్ ప్రముఖ ఆర్థిక వేత్త. సూడాన్ సహా ఆఫ్రికా దేశాల అభివృద్ధికి మార్గం చూపారు. 30 ఏళ్ల పాటు ఆర్థిక వేత్తగా, పాలసీ అనలిస్టుగా కొనసాగారు. నియంత పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అల్‌ బషర్‌ గతేడాది ప్రజాస్వామ్య తిరుగుబాటు కారణంగా పదవి కోల్పోగా, హమ్దోక్‌ గత ఏడాది ఆగస్టు లో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే సోమవారం పేలుడు ఘటన సంభవించిన తరువాత తాను సురక్షితంగా ఉన్నాను అంటూ ఆయనే స్వయంగా ట్వీట్ చేసారు. తన డెస్క్ వద్ద నవ్వుతూ కూర్చున్న ఫోటో ను కూడా ట్వీట్ చేసి క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే, ఇప్పటికీ పాలనను వెనకనుండి నడిపిస్తున్న మిలటరీ నాయకులు.. హమ్దోక్‌కు పూర్తి అధికారాలు అప్పగించేందుకు సుముఖంగా లేకపోవడం తో పాటు ఏడాది నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం 60 శాతానికి చేరగా, నిరుద్యోగిత 22.1శాతానికి పెరిగింది.

ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్య ఉద్యమకారులకు, మిలటరీకి మధ్య గత ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదిరింది. దేశ పరిపాలన కోసం మిలటరీ, పౌర అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించారు. కానీ అలా చేస్తే తమ చేతుల్లోంచి అధికారం వెళ్లిపోతుందన్న ఆలోచన లో ఉన్న మిలటరీ పాలకులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హామ్దక్ పై దాడి జరగడం సంచలనంగా మారింది.

Next Story