ఒకే పాట.. 120 భాషల్లో..!
By Newsmeter.Network Published on 5 Jan 2020 4:54 AM GMT
టాలెంట్ ఎవరి అబ్బ సొత్తూ కాదు.. ప్రతిభ ఉన్నవారికి అందులోను చిన్నారులను మనం కాస్తంత ప్రోత్సహిస్తే చాలు వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి ప్రోత్సాహానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ప్రతిభను చూపే చిన్నారులకు ప్రతీ ఏడాది అందించే అవార్డ్ గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ . ఆ అవార్డును దుబాయ్ లో ఉంటున్న 13 ఏళ్ల ప్రవాస భారతీయ బాలిక సుచేత సతీష్ సంగీతం విభాగంలో సొంతం చేసుకుంది. సుచేత 120 భాషల్లో ఒకే పాటను గానం చేసి ఈ అవార్డును గెలుచుకుంది. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె అవార్డును స్వీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా నృత్యం, సంగీతం, నటన, మోడలింగ్, క్రీడలు.. తదితర అంశాల్లో విశేష ప్రతిభ చాటిన 100 మంది చిన్నారులకు ఈ అవార్డులను అందజేశారు.
120 భాషలలో కచేరీ చేయగల సుచేత రెండేళ్ళ క్రితమే అంటే 12 ఏళ్ళ వయసులో దుబాయిలో ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం లో జరిగిన కచేరీ లో 102 భాషలలో ఏకధాటిగా 6.15 గంటల పాటు గానం చేసి అందరిని అలరించి రికార్డు సృష్టించింది. దుబాయ్ ఇండియన్ హైస్కూల్‌లో గాన కోకిలగా గుర్తింపు పొందిన సుచేత తాజాగా తన రెండో అల్బమ్ ను విడుదల చేశాను. అవార్డు అందుకోవడమే కాదు కార్యక్రమంలో నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యర్థిని కలవడం కూడా సంతోషాన్నిచ్చింది అంటోంది ఈ అమ్మాయి.
ఈ అవార్డులను స్పాన్సర్ చేస్తున్నది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారితో పాటుగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్.