అడవుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే రెండో స్థానం

By రాణి  Published on  31 Dec 2019 6:49 AM GMT
అడవుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే రెండో స్థానం

ముఖ్యాంశాలు

  • స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ 2019 రిపోర్ట్ విడుదల
  • అడవుల విస్తరణలో ఏపీకి దేశంలోనే రెండో స్థానం
  • కనిపించని తెలంగాణ హరితహారం ఫలితాలు
  • ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన పచ్చదనం

అటవీ ప్రాంతం అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలు

కర్ణాటక 1,025 చ.కిమీ
ఆంధ్రప్రదేశ్ 990 చ.కిమీ
కేరళ 823 చ.కిమీ

అటవీ ప్రాంతం విస్తారంగా ఉన్న రాష్ట్రాలు

అరుణాచల్ ప్రదేశ్
చత్తీస్ ఘడ్
ఒడిషా
మహారాష్ట్ర

హైదరాబాద్ : తాజాగా విడుదలైన స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తరణలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే 3.52 శాతం అడవుల వృద్ధితో ఏపీకి జాబితాలో రెండో స్థానం లభించింది. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం ప్రాజెక్ట్ ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినప్పటికీ ఆ రాష్ట్రంలో కేవలం ఒకటికంటే తక్కువ శాతం అడవుల అభివృద్ధి కనిపిస్తోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఏడు చదరపు కిలోమీటర్ల మేర అడవీప్రాంతం కుంచించుకుపోవడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని రిపోర్ట్ అభిప్రాయపడింది.

2017తో పోలిస్తే 2019లో చెట్ల విస్తరణ 155 చదరపు కిలోమీటర్లమేర తెలంగాణలో కుంచించుకుపోయిందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఏపీలో కడపజిల్లాలో 16 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కనుమరుగైపోయింది. రాయలసీమ జిల్లాలైన అనంతపూర్, చిత్తూరు, కర్నూలు కూడా గడచిన రెండు సంవత్సరాల్లో అటవీ ప్రాంతాన్ని, పచ్చదనాన్ని గణనీయంగా కోల్పోయాయని ఈ అధ్యయనం చెబుతోంది.State Of Forest Report 2019 2

కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ని విడుదల చేశారు. కర్నాటకలోకి తుమ్కూరు ప్రాంతంలో దేశంలోనే అత్యధికశాతం అటవీ ప్రాంత అభివృద్ధి జరిగిందని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. 308 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతంలో అడవి విస్తరించింది. 268 చదరపు కిలోమీటర్ల విస్తరణతో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలవగా, 257 చదరపు కిలోమీటర్ల విస్తరణతో కేరళలోని పాలక్కడ్ మూడో స్థానంలో, 246 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం విస్తరణతో పశ్చిమ గోదావరి జిల్లా నాలుగో స్థానంలోనూ నిలిచాయి.

హరితహారంవల్ల కనిపించని ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హరిత హారం ప్రాజెక్ట్ ను విస్తృత స్థాయిలో అమలు చేసినప్పటికీ పచ్చదనం ఇక్కడ భారీగా లోపించినట్టుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. మొత్తంగా భారత్ లో ఈ ఏడాది 3,976 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించగా, 1,212 చదరపు కిలోమీటర్లమేర పచ్చదనం పరచుకుంది. 2017తో పోలిస్తే 2019లో మొత్తంగా 5,188 చదరపు కిలోమీటర్లమేర దేశంలో అటవీ ప్రాంతం, పచ్చదనం విస్తరించాయి. తెలంగాణ రాష్ట్రంలో 20,582 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న భూమి విస్తీర్ణంలో ఇది 18.36 శాతం. ఇంత చక్కటి అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం వెనకబడే ఉందనడానికి 0.8 శాతం అభివృద్ధే నిదర్శనమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఏపీలో విస్తరిస్తున్న అటవీ ప్రాంతం

ఆంధ్రప్రదేశ్ లో 29,137 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. మొత్తంగా రాష్ట్రం భూ విస్తీర్ణంలో ఇది 17.8 శాతం. 2017తో పోలిస్తే 2019లో ఏపీలో మొత్తం 990 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించింది. రాయలసీమలో మాత్రం పచ్చదనం పూర్తిగా కరవైనట్టుగానే కనిపిస్తోందని ఈ సర్వే అభిప్రాయపడింది. తూర్పు గోదావరిజిల్లాలో 268 చదరపు కిలోమీటర్లు అడవి విస్తరించింది. తర్వాతి స్థానాల్లో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలు నిలిచాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనం 161 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిందనీ, 2017తో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధేనని ఈ అధ్యయనం చెబుతోంది.

కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు వరసగా అడవులు విస్తీర్ణం అభివృద్ధి చెందడం అనే విషయంలో దేశంలోనే అగ్రస్థానాల్లో నిలిచాయి. ఇదిమాత్రమే కాక దేశంలోని కొండ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో 140 జిల్లాలు 544 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అటవీ ప్రాంత అభివృద్ధిని నమోదు చేశాయి. మానవ నిర్మితమైన అడవులు కేవలం నామమాత్రంగా 54 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించాయి.

Next Story
Share it