ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీ గల సరళసాగర్‌కు భారీ గండి
By Newsmeter.Network
వనపర్తి: సరళసాగర్ జలాశయానికి భారీ గండి పడింది. మదనాపురం మండలం శంకరమ్మపేట వద్ద జలాశయం కట్ట తెగింది. దీంతో సరళసాగర్ జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. పదేళ్ల తర్వాత సరళసాగర్‌కు భారీగా వరద చేరింది. రైల్వేస్టేషన్ దగ్గరలోని బ్రిడ్జి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. లీకేజీ ద్వారా బయటకువస్తున్న నీరు రామన్‌పాడు ప్రాజెక్టుకు చేరుతోంది. రామన్‌పాడు ప్రాజెక్టు 8 గేట్లను అధికారులు ఎత్తారు. ఆసియాలోనే ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన జలాశయంగా సరళసాగర్‌కు గుర్తింపు ఉంది. నీరు పోకుండా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 1959 జులై 26న అప్పటి రాష్ట్ర మంత్రి జె. నర్సింగరావు ఈ జలాశయాన్ని ప్రారంభించారు. సుమారు 4,500 అడుగుల పొడవు గల ఈ జలాశయానికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. సరళసాగర్ జలాశయాన్ని కృష్ణానది ఉపనది అయిన చిన్నవాగుపై నిర్మించారు. ఈ జలాశయం నీటి వల్ల ఎంతో మంది రైతులు లబ్దిపొందుతున్నారు.
సరళసాగర్ ప్రాజెక్టును మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. నీరు వృథాగా పోతోంది తప్ప ఎవరికీ నష్టం కలగలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్ట్ పునర్‌నిర్మాణం చేపడతామన్నారు. ఆయకట్టు రైతాంగానికి రెండో పంటకు నీరిస్తామన్నారు.