ప్లీజ్ అర్థం చేసుకోండి..మాకూ ప్రైవసీ ఉంటుంది..!

By రాణి  Published on  6 Feb 2020 12:26 PM GMT
ప్లీజ్ అర్థం చేసుకోండి..మాకూ ప్రైవసీ ఉంటుంది..!

బిగ్ బాస్ 3 సీజన్ లో సెకండ్ విన్నర్ అవ్వడంతో తెగ ఫేమస్ అయిపోయిందీ నిజమాబాద్ పోరీ, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి. అప్పటి వరకూ పటాస్ షో తో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు ఏకంగా టైమ్స్ సెర్చ్ లో టాప్ 1 స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా మోస్ట్ యాక్టివిస్ట్ పర్సన్ కూడా మన శ్రీముఖినే. అయితే బిగ్ బాస్ తో వచ్చిన బిగ్ సెలబ్రిటీ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది. ఆ షో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి తన ఇంటికి చాలా మంది వస్తున్నారట.

అసలే తీరికలేకుండా షో లు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండే కాస్తంత సమయం కూడా ప్రశాంతంగా ఉండనివ్వకపోతే ఎలా చెప్పండి..ఫ్యాన్స్ వల్ల తన ప్రైవసీ పోతోందని బాధపడుతోంది శ్రీముఖి. తనతో ఫొటోలు దిగాలని చెప్పి గంటల తరబడి ఇంటివద్దే వేచి ఉంటున్నారట. గురువారం కూడా ఇలాగే జరగడంతో శ్రీముఖి అసహనం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ అంటే అబ్బాయిలు మాత్రమే అనుకునేరు...అమ్మాయిలు కూడా అలానే వస్తున్నారట. గురువారం ఉదయం జరిగిన ఘటనకు ఆమె ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ తన మనసులోని మాటలను అభిమానులకు ఒక వీడియో ద్వారా తెలిపారు.

“మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇలాంటి విషయాలు చెప్పేందుకు లైవ్ కు వస్తున్నా అని ముందే చెప్పి రాలేము. చాలా మంది పలానా సమయానికి వస్తామని ముందే చెప్తారు. అప్పుడు వారితో చాట్ చేయొచ్చు. సరదాగా మాట్లాడొచ్చు..కానీ ఇది అలాంటి లైవ్ కాదు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాను. అందుకు కారణం నా ఫ్యాన్సే. మీరంటే ఇష్టం. హౌస్ లో మీ పెర్ఫామెన్స్, మీ తీరు నచ్చింది. మిమ్మల్ని కలవాలి. ఫొటోలు దిగాలి అంటుంటే చాలా బాగుంది. ఈ విషయాన్ని గతంలో కూడా మాట్లాడాను. హౌస్ నుంచి వచ్చాక నేను ఎక్కడుంటున్నానో చాలా మంది తమ స్నేహితుల ద్వారా తెలుసుకుని ఫొటోలు దిగాలంటూ ఏకంగా ఇంటికొచ్చేస్తున్నారు. సమయం, సందర్భం ఏమీ చూసుకోవడం లేదు.

నన్ను కలవాలనుకుంటే ముందే చెప్పండి

మమ్మల్ని ప్రేమించే అభిమానులుండటం నిజంగా మా అదృష్టం. అలాంటి అభిమానుల కోసమే మేకప్ లు వేసుకుని టీవీ ముందుకొచ్చి మిమ్మల్ని అలరిస్తున్నాం. మాకు ఇంత గొప్ప పేరు రావడానికి కారణం మీరే. కానీ ప్రతి వ్యక్తికీ ప్రైవసీ అనేదొకటుంటుంది. దానిని పట్టించుకోకుండా కొందరు ఇంటికి వచ్చేస్తున్నారు. నా కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. “మేము విజయవాడ నుంచి వచ్చాం. వరంగల్ నుంచి వచ్చాం. మీతో ఫొటో దిగాలి” అని అడుగుతున్నారు. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. అమ్మాయిలు, అబ్బాయిలు కూడా నా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. నేను ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. నేనెవరో మీ అందరికీ తెలుసు. కానీ, మీలో చాలా మంది నాకు తెలీదు. ముందుగా నా అసిస్టెంట్లకు సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకుంటే నా కోసం రావచ్చు గానీ..సడెన్ వచ్చి ఫొటోలు దిగుతామంటే ఎలా చెప్పండి. ?”

“ప్రస్తుతం టెలివిజన్ షో చేస్తున్నా. నిన్న మూడు ఎపిసోడ్ లు పూర్తయ్యే సరికి రాత్రి 3 గంటలైంది. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి షూటింగ్ కు వచ్చేశా. తీరిక లేకుండా సమయం గడుపుతూ ఉంటాను. నిత్యం ఒత్తిడితో ఉంటాం. కొన్నిసార్లు మా మానసిక స్థితి సరిగా ఉండదు. అవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి, అక్కా మేం పలానా ప్రాంతం నుంచి వచ్చాం..ఫొటో దిగుతాం అని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. వెంటనే కారెక్కి వచ్చేశా. మీరు నిజంగా నా అభిమానులే అయి ఉండవచ్చు. కానీ..మాకు కూడా కొంచం ప్రైవసీ ఉంటుందిగా..ప్లీజ్ అర్థం చేసుకోండి.

నన్ను కలవాలనుకుంటే వేరే మార్గముంటుంది. ముందుగా సమాచారం ఇస్తే..ఫొటోనే కాదు..కొద్దిసేపు మాట్లాడుతా. ప్రతి ఒక్కరికీ స్పెషల్ సెల్ఫీ కూడా ఇస్తా. దూరప్రాంతాల నుంచి నా కోసం రావొద్దు. వచ్చి గంటల తరబడి వేచి ఉండొద్దు. చాలా బాధగా ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడానికి కాస్త బాధగానే ఉన్నా..చెప్పక తప్పట్లేదు. అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా.. నాకోసం వచ్చిన వారి కోసం సారీ చెప్తున్నా. మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు.” అని శ్రీముఖి ఇన్ స్టా లో లైవ్ కి వచ్చి చెప్పింది.

Next Story