Fact Check : రామ్ దేవ్ బాబాను చూసి ఉడుత యోగాసనాలు చేస్తోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 May 2020 11:59 AM GMT
Fact Check : రామ్ దేవ్ బాబాను చూసి ఉడుత యోగాసనాలు చేస్తోందా..?

ఓ ఉడుతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబా రామ్ దేవ్ యోగాను ప్రతి రోజూ గమనిస్తూ వస్తున్న ఓ ఉడుత.. ఏకంగా యోగా చేస్తోందట. హరిద్వార్ లోని బాబా రామ్ దేవ్ ఆశ్రమం సమీపంలో ఇలా ఉడుత యోగా చేస్తోందని ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెండు కాళ్ల మీద నిలబడిన ఉడుత.. గాలి పీలుస్తూ వదులుతూ అచ్చం యోగాసనంలా చేస్తోంది.



ఆ ఉడుత హరిద్వార్ లోని బాబా రామ్ దేవ్ ఆశ్రమం లోని ఓ చెట్టు మీదుంటోందని.. యోగా గురు చేసే కపాల్ భాటి అనే ఆసనం ఆ ఉడుత చూస్తూ ఉందట. ఈ యోగాసనంలో గాలి గట్టిగా పీల్చుకుని.. వదులుతూ ఉండడాన్ని చేస్తారు. అచ్చం అలాగే ఈ వీడియోలో ఆ ఉడుత చేయడాన్ని గమనించవచ్చు. దీంతో ఈ వీడియోకు, యోగా గురు రామ్ దేవ్ బాబాకు లింక్ చేస్తూ పలువురు తమ తమ సోషల్ మీడియా అకౌంట్ లలో షేర్ చేస్తూ ఉన్నారు.

నిజమెంత:

ఈ వీడియోలో కనిపిస్తున్న ఉడుత 'ఈస్ట్రన్ గ్రే స్క్విరెల్' జాతికి చెందినది. ఇవి ఉత్తర అమెరికాలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. kids.nationalgeographic.com పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారం అమెరికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్ లో 1800 నుండి ఇవి బ్రతుకుతూ ఉన్నాయి.

కానీ భారత దేశంలో ఇండియన్ పామ్ స్క్విరెల్, ఇండియన్ జెయింట్ స్క్విరెల్ జాతుల ఉడుతలు మాత్రమే ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఉడుతలు భారత దేశంలో కనిపించడం చాలా అరుదు. ఒకవేళ అది బాబా రామ్ దేవ్ ఆశ్రమం దగ్గర బ్రతుకుతున్నా అది శ్వాస పీల్చుకోవడం లాంటి యోగాసనం చేయడం మాత్రం పచ్చి అబద్ధం.

ఉడుతలు చాలా రహస్యంగా బ్రతికే జంతువులు. కానీ చాలా తెలివైనవి కూడానూ..! ఒక ఉడుత మరో ఉడుతతో సంభాషణలు కూడా చేసుకోగలవు. కొన్ని కొన్ని సార్లు తమ దగ్గరకు వచ్చే పెద్ద జంతువులకు.. ఇక్కడ నుండి దూరంగా పోవాలి అనే సిగ్నల్స్ ను కూడా ఇస్తూ ఉంటాయి. దూరం నుండే ఒక ఉడుతతో మరో ఉడుత సంభాషిస్తూ ఉండడం బాగా గమనించవచ్చు. ఉడుతలు ఆవేశంగా చేసే శబ్దాలను అమెరికాలో 'బార్కింగ్' అని అంటారు.తోకలను కదిలిస్తూ.. ఏదో ఒక శబ్దం చేయడాన్ని 'ముక్-ముక్' అని అంటారు.

ప్రస్తుతం వీడియోలో వైరల్ అవుతున్న ఉడుత చేష్టలు చాలా దేశాల్లోని ఉడుతలు చేయడాన్ని యూట్యూబ్ లోని వీడియోలలో గమనించవచ్చు.

ఉడుతలు ఇలా ప్రవర్తించడం చాలా సాధారణమైన విషయమే..! కోపం, బాధ లాంటి అంశాలను ఇలాంటి హావభావాల ద్వారా తెలుపుతాయట. అంతేకాని వీడియోలో ఉడుతలు శ్వాస తీసుకోవడం లాంటి ఆసనాలను చేయడం లేదు. ఈ జాతి ఉడుతలు కూడా భారత్ లో కనపడవు.

కాబట్టి రామ్ దేవ్ బాబా ఆశ్రమంలో ఉడుత యోగా చేస్తోందన్నది 'పచ్చి అబద్దం'.

Claim Review:Fact Check : రామ్ దేవ్ బాబాను చూసి ఉడుత యోగాసనాలు చేస్తోందా..?
Claim Fact Check:false
Next Story