వలస కార్మికుల కోసం పట్టాలెక్కనున్న 400 ప్రత్యేక రైళ్లు

By సుభాష్  Published on  2 May 2020 7:12 AM GMT
వలస కార్మికుల కోసం పట్టాలెక్కనున్న 400 ప్రత్యేక రైళ్లు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కాగా, మే 3 వరకు ఉన్న ఈ లాక్‌డౌన్‌ను 17 వ తేదీ వరకు పొడిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే చాలా మంది వలస కార్మికులు, కార్మికులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పందించి కేంద్రం.. సొంత రాష్ట్రాలకు పంపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో లాక్‌డౌన్‌ కారణంగా నానా తంటాలు పడుతున్న వలస కూలీలకు కేంద్రం తీపి కబురు వినిపించినట్లయింది. ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇక వారిని తరలించేందుకు 400 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కన్నాయి. రైల్వే టికెట్‌ ఎంతన్నది రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. అయితే రైళ్లలో ప్రయాణించే వారు మాత్రం సామాజిక దూరం పాటించాల్సిందే. లేకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు రైలు సదుపాయం

అయితే వలస కూలీలను, కార్మికులను, విద్యార్థులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సహా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వలస కార్మికుల తరలింపునకు కేంద్ర సర్కార్‌ అనుమతి ఇచ్చింది. ఇక బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని తరలించేందుకు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.

లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది కార్మికులను బస్సుల్లో తరలించడం ఇబ్బందికరమైన విషయమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. నాన్‌స్టాప్‌ రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశాయి. ఇప్పుడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుండటంతో వలస కూలీలకు, కార్మికులకు భారీ ఊరట నిచ్చినట్లయింది.

Next Story