కోర్టులో 'సమత' దోషులు ఏమన్నారో తెలుసా.?

By సుభాష్  Published on  30 Jan 2020 8:50 AM GMT
కోర్టులో సమత దోషులు ఏమన్నారో తెలుసా.?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1 నిందితుడు షేక్‌ బాబు, ఏ2 నిందితుడు షాబుద్దీన్‌, ఏ3 నిందితుడు షేక్‌ మగ్దంలకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... మీపై నేరం రుజువైందని, కోర్టుకు ఏమైన చెప్పాలనిపిస్తే చెప్పాలని నిందితులకు అడిగారు. దీనిపై స్పందించిన ముగ్గురు నిందితులు తమకు ప్రాణభిక్ష పెట్టాలని న్యాయమూర్తి ముందు కంటతడి పెట్టుకున్నారు. తమకు చిన్న పిల్లలున్నారని, కుటుంబానికి పెద్దదిక్కు తామేనంటూ వాపోయారు. కాగా, ఈ కేసు విచారణకు గత ఏడాది డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబీకులతో పాటు గ్రామస్తులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సీ వైద్యులు ఇలా మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. డిసెంబర్‌ 31న న్యాయస్థానంలో విచారణ పూర్తయింది. అలాగే ఈనెల 20తో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదుల మధ్య వాదనలు కూడా ముగిశాయి. దీంతో ఎట్టకేలకు ఈ రోజు ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది న్యాయస్థానం.

గ్రామాల్లో బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించిన ముగ్గురు వ్యక్తులు గత ఏడాది నవంబర్‌ 24వ తేదీన కొమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లపటార్‌ శివారులో చెట్లపొదలకు తీసుకెళ్లి అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. నవంబర్‌ 25వ తేదీన ఆమె మృత దేహం లభ్యమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు విచారణ జరుగగా, ఈరోజు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ప్రత్యేక న్యాయస్థానం.

Next Story