కరోనాకు తాత ఈ 'స్పానిష్ ఫ్లూ'.. ఇది 5 కోట్ల మందిని తినేసింది

By అంజి  Published on  14 March 2020 9:47 AM GMT
కరోనాకు తాత ఈ స్పానిష్ ఫ్లూ.. ఇది 5 కోట్ల మందిని తినేసింది

కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉండొచ్చు. కానీ గతంలో కరోనా కన్నా ప్రాణాంతకమైన, భయంకరమైన మహమ్మరులు వచ్చాయి. ఉదాహరణకి 1918 లో యూరప్ ను గడగడలాడించిన స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా లేదా ఫ్లూ వ్యాధి దాదాపు అయిదు కోట్ల మంది ప్రాణాలను పొట్టన బెట్టుకుంది. పది కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అంటే వ్యాధి వచ్చిన ఇద్దరిలో ఒకరు చనిపోయారన్న మాట.

అయితే స్పానిష్ ఫ్లూ స్పెయిన్ లో పుట్టలేదు. రెండోప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో యూ ఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ లలో అప్పటికే ఫ్లూ వ్యాధి భయంకరంగా వ్యాపించడమే కాక లక్షల మందిని ఫలహారం చేసేసింది. కానీ మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న కారణంగా ప్రజలలో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ వార్తలను పత్రికలలో ప్రచురించనీయలేదు. దీంతో లక్షలమంది చనిపోయినా వార్తలు రాలేదు. కానీ స్పెయిన్ ఈ విషయంలో ఉదారవాద నీతిని అవలంబించింది. దాంతో పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వ్యాధికి స్పానిష్ ఫ్లూ అన్న పేరు వచ్చింది. తమాషా ఎమిటంటే ఈ వ్యాధిని బ్రెజిల్ లో జర్మన్ ఫ్లూ అనేవారు. సెనెగల్ లో బ్రెజిలియన్ ఫ్లూ అనేవారు.

పోలండ్ లో దీనిని బోల్షెవిక్ ఫ్లూ అనేవారు.

అయితే ఇప్పుడు వ్యాధికి దేశాల పేర్లు రాకుండా, ఆ దేశాలకు మచ్చ రాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకుంది. అందుకే ఎవరూ కరోనాను చైనీస్ ఫీవర్ లేదా వుహాన్ ఫీవర్ అనడం లేదు. దీనికి కోవిడ్ 19 అనే పేరు పెట్టారు.

నిజానికి కరోనాను ఫ్లూ తో పోల్చలేము. ఎందుకంటే ఫ్లూ శరవేగంగా అందరిలోనూ వ్యాపించింది. కానీ కరోనా గుంపులు గుంపులుగా ఉన్న వారిలో మాత్రమే వ్యాపిస్తుంది. కాబట్టి ప్రజలు ఎక్కువ మంది ఒకే చోట కలిసి ఉండకుండా చేయగలిగితే కరోనా వ్యాధిని త్వరగానే నివారించవచ్చు.

మరో విషయం ఏమిటంటే ... 1918 కి 2020 కి చాలా తేడా ఉంది. అప్పట్లో శాస్త్ర పరిజ్ఞానం ఇంతగా వ్యాపించలేదు. ఉదాహరణకు అప్పట్లో ప్రజలు మత పెద్దల మాటను తుచ తప్పకుండా గుడ్డిగా పాటించేవారు. ఉదాహరణకు స్పెయిన్ లోని జామొరా నగరంలో అంటువ్యాధులను అరికట్టే దివ్యాత్ముడిగా పేరున్న సెయింట్ రోకో కు తొమ్మిది రోజుల పాటు సామూహిక ప్రార్థనలను నిర్వహించడం జరిగింది. చర్చి నేతలు వైద్యుల సలహాను పెడచెవిని పెట్టి మరీ ఈ ప్రార్థనలు నిర్వహించారు. ఫలితంగా జామోరాలో సెయింట్ రోకో చర్చి ప్రార్థనలకు వెళ్లినవారిలో చాలా మంది పిట్టల్లా రాలిపోయారు. జామొరాలో అత్యధిక సంఖ్యలో చావులు నమోదయ్యాయి.

విగ్రహాన్ని నాకడం ఒక ఆచారం..

దురదృష్టవశాత్తూ వ్యవస్థీకృతమైన మతాల వల్ల కరోనా వంటి వ్యాధులు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ విషయంపై పెద్దగా అధ్యయనాలు జరగలేదు. జరిగినా వాస్తవాలను దాచి పెట్టడం జరిగింది. ఉదాహరణకు దక్షిణ కొరియాలో కరోనా (కోవిద్ 19) వ్యాప్తిలో చర్చిల పాత్ర ఎంతైనా ఉంది. చర్చిలకు వెళ్లిన వారిలోనే కరోనా అత్యధికంగా వచ్చింది. అలాగే ఇరాన్ లోని కోమ్ నగరంలోని ఫాతిమా మాసుమే మందిరంలో విగ్రహాన్ని నాకడం ఒక ఆచారం. నాకిన వారిలో చాలా మందికి కరోనా సోకింది. ఒక వైపు వ్యాధి వ్యాపిస్తూండగానే విగ్రహాన్ని నాకిన ఫోటోలను ప్రజలు సోషల్ మీడియాలో సగర్వంగా పెట్టుకోవడం గమనార్హం.

స్పానిష్ ఫ్లూ వల్ల దాదాపు 14 లక్షల మంది భారతీయులు కూడా చనిపోయారు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు ఎక్కడికి వెళితే అక్కడికి స్పానిష్ ఫ్లూ వెళ్లింది. సైన్యంలో పనిచేసిన భారతీయులు పిట్టల్లా రాలిపోయారు. సైనికులు తిరిగి రావడంతో ముంబాయి అంతటా ఫ్లూ వ్యాపించింది. రైలు ఏయే మార్గాల్లో వెళ్తే ఆయా మార్గాల్లోకి ఫ్లూ వైరస్ వెళ్లింది. మొత్తం ముంబాయి ప్రెసిడెన్సీ అంతటా ఫ్లూ వ్యాపించింది. ఆ సమయంలో గాంధీ గారికి కూడా ఫ్లూ సోకింది. ఆ వ్యాధి ఆయనను ఎంతగా కుంగదీసిందంటే “నాకు బ్రతకాలన్న కోరిక చచ్చిపోయింది” అని ఆయన వ్రాసుకున్నారు.

Next Story