కరోనా అదుపుకు స్పెయిన్ ఏం చేసిందో తెలుసా

By అంజి  Published on  18 March 2020 3:23 AM GMT
కరోనా అదుపుకు స్పెయిన్ ఏం చేసిందో తెలుసా

ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనాను చైనా కాస్తలో కాస్త కంట్రోల్ చేసింది. అయితే యూరప్ దేశాలలో పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. ఇరాన్‌, ఇటలీ, స్పెయిన్‌ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.

స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఫుడ్, మెడిసిన్ ల కోసం షాపింగ్ వంటి కనీస అవసరాలకు,పని నుంచి ఇంటికి వెళ్లడం.రావడం తప్పితే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని స్పెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాజధాని మాడ్రిడ్‌లో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు తప్ప అన్నీ మూతపడ్డాయి. అధికారులు డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.రవాణా సదుపాయాన్ని కూడా తగ్గించింది. రెస్టారెంట్లు,హోటల్స్ కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పుడు కరోనాపై యుద్ధంలో భాగంగా స్పెయిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ను జాతీయం చేస్తున్నట్లు స్పెయిన్ ఆరోగ్యశాఖ మంత్రి స్లేవడార్ ఇల్లా ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రైవేట్ హెల్త్ ప్రొవైడర్స్, హాస్పిటల్స్ ను పబ్లిక్ కంట్రోల్ లోకి తీసుకొచ్చినట్లు ఆయన ప్రకటించాడు. అంటే ఇప్పుడు స్పెయిన్‌లో ఉన్న ప్రతీ ఆస్పత్రీ... ప్రభుత్వ ఆస్పత్రే. అందువల్ల కరోనా బాధితులు ఏ ఆసుపత్రికి అయినా వెళ్లి చికిత్స పొందచ్చు. అది కూడా ఫ్రీ గా.

అంతేకాకుండా దేశంలోని నాలుగో ఏడాది చదువుతున్న మెడికల్ విద్యార్థులందరినీ స్పెయిన్ హెల్త్ సర్పీస్ కు సాయం చేయాలని కోరడం జరిగిందని ఇల్లా తెలిపారు. ఇదే సమయంలో మెడికల్ పరికరాలను ఉత్పత్తి చేయగల సామర్థం ఉన్న కంపెనీలు ప్రభుత్వంతో టచ్ లో ఉండాలని ఆయన తెలిపారు. మొత్తానికి స్పెయిన్ ప్రభుత్వం కోవిడ్ ను కంట్రోల్ లో పెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తోంది.

Next Story