స్పెయిన్‌ ఆస్పత్రుల్లో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు..

By అంజి  Published on  25 March 2020 2:10 AM GMT
స్పెయిన్‌ ఆస్పత్రుల్లో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు..

స్పెయిన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌.. ఇటలీ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అంతే స్థాయిలో స్పెయిన్‌లో కరోనా వైరస్‌ తన ప్రభావాన్ని చూపుతోంది. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

తాజాగా పలు ఆస్పత్రుల్లో వైరస్‌ను చంపే ద్రావణాన్ని స్ప్రే చేసేందుకు ఆ దేశ ఆర్మీ బలగాలు వెళ్లాయి. అక్కడ అధిక సంఖ్యలో మృతదేహాలు కనిపించాయని రక్షణ మంత్రి మార్గరీటా తెలిపారు. ఇక మృతుల్లో కూడా ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం నాడు స్పెయిన్‌లో కరోనా దెబ్బకు 514 మంది తమ ప్రాణాలను విడిచారు. ఎంత మంది మృతదేహాలు ఉన్నాయని మాత్రం ఇంకా తెలియలేదు. అయితే అక్కడి ఆస్పత్రుల్లో మాత్రం ఎక్కవ సంఖ్యలోనే మృతదేహాలు ఉన్నాయని సమాచారం.

ఆ దేశంలో ఇప్పటి వరకు 2,696 మంది మరణించారని, 40 వేల మందికి కరోనా సోకిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నమోదైన కేసుల్లో సుమారు 5,400 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారని తెలిసింది. ఇటలీ తర్వాత యూరప్‌లో అత్యధికంగా ప్రభావితమైన దేశం స్పెయిన్‌. ఇక ఇటలీ దేశంలో 6,000 మందికి పైగా మరణించారు.

Also Read: తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు.. అది కూడా

వైరస్‌ కేసులు ఎక్కువగా స్పెయిన్‌ దేశంలోని మాడ్రిట్‌, కాటలోనియా, బాస్క్‌ కంట్రీలో నమోదు అవుతున్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కాంటాక్ట్‌ కేసులు పెరుగుతోంది. రాజధాని సరిహద్దుల్లో ఉన్న కాస్టిలియా-లా మంచా, కాస్టిల్లా వైలియోన్‌ ప్రాంతాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా వృద్ధ జనాభా ఉంది.

ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ చీఫ్ ఏంజెలో బొర్రెల్లి మంగళవారం వార్తాపత్రిక లా రిపబ్లికాతో మాట్లాడుతూ... కరోనా సోకిన వారి సంఖ్య వాస్తవానికి 10 రెట్లు అధికంగా ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు.

కరోనావైరస్ వ్యాధి మహమ్మారి "వేగవంతం" అవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది, అయినప్పటికీ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ "కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడం" ఇంకా సాధ్యమేనని అన్నారు. కఠినమైన పరీక్షలు, కాంటాక్ట్-ట్రేసింగ్ వ్యూహాలను అవలంబించాలని ఆయన దేశాలను కోరారు

Next Story