బిగ్ బ్రేకింగ్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
By సుభాష్ Published on 25 Sept 2020 1:28 PM ISTప్రముఖ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించడంతో మరణించినట్లు కుమారుడు చరణ్ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. ఆగస్టు 5న కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాలు.. ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందారు. అయితే పది రోజుల నుంచి క్రమ క్రమంగా కోలుకుంటున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలు కుమారుడు కూడా నాన్న ఆరోగ్యం మెరుగు పడుతోందని ప్రతి రోజు సోషల్ మీడియా ద్వారా బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించారు.
అయితే అకస్మాత్తుగా నిన్న సాయంత్రం బాలు ఆరోగ్యం విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బాలు ఆత్మయుడు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆస్పత్రికి చేరుకుని బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 రోజులుగా అనారోగ్యంతో పోరాడిన చివరికి బాలు ప్రాణాలు వదిలారు.
ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలు క్షేమంగా కోలుకోవాలని చేసిన ప్రార్థనలు ఫలించలేదు. వేలాదిగా పాటలు పాడిన బాలుకు.. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. నిన్న సాయంత్రం నుంచి బాలు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు ఉదయం నుంచి సినీ ప్రముఖులు, ఆత్మీయులు, అభిమానులు భారీగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు.