ఒక వైపు కరోనా విజృంభణ.. మరో వైపు పార్లమెంట్‌ ఎన్నికలు

By సుభాష్  Published on  12 April 2020 5:20 AM GMT
ఒక వైపు కరోనా విజృంభణ.. మరో వైపు పార్లమెంట్‌ ఎన్నికలు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. దాదాపు 200పైగా దేశాలకు పాకిన కరోనా వైరస్‌ గంటగంటకు మృత్యువును వెంటాడుతోంది. ఈ వైరస్‌ బారిన ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ మాట అలా ఉంచితే.. దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ ఉన్నప్పటికీ బుధవారం అంటే ఏప్రిల్‌ 15వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమేంటని అందరు ఆశ్చర్యపోయే విషయమే. కానీ అన్ని రకాల జాగ్రత్తల నడుమ ఈ పోలింగ్‌ కొనసాగనుంది. దక్షిణ కొరియాలో మొత్తం ఓటర్లు 4.4 కోట్లు.

కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం, ఎన్నికల అధికారులకు అన్ని రకాల రక్షణ పరికరాలు, మాస్కులు, సూట్‌లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా 14వేల పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి, అక్కడ మార్కింగ్‌లు కూడా చేస్తున్నారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఓటు వేసేందుకు కరోనా వైరస్‌ వల్ల ఎలాంటి అడ్డంకులు ఉండవనే రీతిలో కృషి చేస్తున్నారు అధికారులు.

క్వారంటైన్‌లో 450 మంది

కాగా, కరోనా వైరస్‌ కారణంగా క్వారంటైన్‌లో 450 మంది ఉన్నారు. వారికోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వారికి నిర్ధిష్టమైన ప్రదేశాలలో బూత్‌లు ఏర్పాటు చేయడం, వారికి గౌన్‌లతో సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ బూత్‌ లకు తసుకువచ్చేలా చేస్తున్నారు. వారికి ప్రత్యేక గౌన్లు తొడిగించినప్పటి నుంచి బూత్‌లకు తీసుకువచ్చి ఓటు వేసే వరకు వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

అలాగే దక్షిణ కొరియాకు చెందిన ఓ మంత్రి కూడా క్వారంటైన్లో ఉన్నారు. ఆయన కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని ఓటు వేస్తారు.

Next Story