చిరుత కనిపించింది.. స్కూల్స్‌కు హాలిడే ప్రకటన

Leopard seen in Belagavi city holiday declared for schools. కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి నగరంలో చిరుతపులి కనిపించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

By M.S.R  Published on  8 Aug 2022 11:23 AM GMT
చిరుత కనిపించింది.. స్కూల్స్‌కు హాలిడే ప్రకటన

కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి నగరంలో చిరుతపులి కనిపించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం నాడు 11 పాఠశాలలు మూసివేయబడ్డాయి. అటవీ శాఖ, పోలీసు అధికారులు చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తూ ఉన్నారు. క్లబ్‌ రోడ్డు సమీపంలోని గోల్ఫ్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం స్థానికులు చిరుతపులిని గుర్తించారు. జాదవ్‌నగర్‌లో శుక్రవారం ఓ కూలీపై చిరుతపులి దాడి చేసింది. దీంతో గోల్ఫ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

చిరుతపులి మరొకరిని గాయపరచకముందే దాన్ని పట్టుకునేందుకు అటవీ, పోలీసు శాఖల సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను బయటికి పంపవద్దని సూచించారు. చిరుతపులి దాడికి గురైన కార్మికుడు సిద్దరాయి మిరాజ్‌కర్‌ తల్లి 65 ఏళ్ల శాంత గుండెపోటుతో మృతి చెందింది. చిరుత దాడిలో తన కొడుకు చనిపోయాడని శాంత భావించారు. తన కొడుకు చనిపోయాడని తల్లి భావించింది, అయితే బాధితుడు దాడి నుండి తప్పించుకోగలిగాడు.

వైద్య చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. చిరుతపులి సంచారం సీసీటీవీలో రికార్డవ్వడంతో స్థానికుల్లో భయం నెలకొంది. దక్షిణ కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెగ్గడదేవనకోట్ నగరంలో కూడా రెండు చిరుతలు సంచరించడంతో ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. చిరుతపులి పశువులపై దాడి చేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అక్కడ సంచరిస్తున్న చిరుతలను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Next Story