దాదాతో భజ్జీ 'భల్లే భల్లే'..
By Newsmeter.Network Published on 14 Jan 2020 9:06 AM GMT
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటేనే అల్లరి. తను ఎక్కడ ఉంటే అక్కడ తన అల్లరితో అందరిని అలరిస్తాడు. ఇక గంగూలితో భజ్జీకి ఉన్న అనుభందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా గంగూలితో కలిసి హర్భజన్ 'సెనోరిటా' పాటకు డ్యాన్స్ చేశారు. ఇంకేముంది సోషల్ మీడియాలో వీరిద్దరు వేసిన డ్యాన్ వీడియో వైరల్ గా మారింది. ఆ పాటకు వీరిద్దరు తమదైన మూమెంట్స్ తో అదరగొట్టారు.
బెంగాలీకి చెందిన ఒక టెలివిజన్ చానెల్‌లో దాదాగిరి అన్‌లిమిటెడ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు భారత క్రికెటర్లను ఈ షోకి ఆహ్వానించారు. దాదా వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ షోలో వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ లు పాల్గొన్నారు. వీరందరూ ఆ షోలోచేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కార్యక్రమం మధ్యలో ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ 'సెనోరిటా' అనే పాపులర్ పాటను ఆలపించారు. ఉషా ఉతుప్ పాడిన పాటకు హర్భజన్ డ్యాన్స్ చేయడమే గాక దాదాతోను కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ చేయించాడు. అయితే ఇదంతా గమనిస్తున్నఇతర క్రికెటర్లు క్లాప్స్ కొడుతూ వారిద్దరిని ఎంకరేజ్ చేశారు.
మొదట గంగూలీ డ్యాన్స్ చేయడానికి కొంత ఇబ్బంది పడినా చివరకు భజ్జీ సాయంతో డ్యాన్స్ బాగానే చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన క్రికెటర్లలో ఒక్క అశ్విన్ తప్ప మిగతా అందరూ దాదా నాయకత్వంలో ఆడినవారే కావడం గమానార్హం. ఈ వీడియోను సదరు చానెల్ యాజమాన్యం ట్విటర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.