నీట్, జేఈఈ పరీక్షలు: రంగంలోకి దిగిన సోనూసూద్
By సుభాష్ Published on 29 Aug 2020 2:08 AM GMTకరోనా పరిస్థితుల్లో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్.. ప్రస్తుతం తనదైన శైలిలో రంగంలోకి దిగుతున్నారు. ఈ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు సోనూసూద్ రంగంలోకి దిగారు.
విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమవుతున్నారు. ఒక వైపు దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ఎందరో పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కులం, మతం అనే తేడా లేకుండా వారికి సాయం చేసి అండగా నిలుస్తున్నారు సోనూసూద్. ఈ నేపథ్యంలో ఒక వైపు కరోనా, మరో వైపు తండ్రి, పేదరికం, ఆర్థిక కష్టాలు ఇలా చాలా దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఎలా వెళ్లాలి.. దయ చేసి సాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంటున్న విద్యార్థి ఆవేదనను సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సోనూసూద్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖరారైతే ఆయా ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అస్నాం, గుజరాత్, బీహార్‌లో వరద బాధిత ప్రాంతాల్లో పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులందరికీ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు సోనూసూద్. బాధిత విద్యార్థులు దీనికి సంబంధించిన తగిన సమాచారాన్ని తనకు అందించాలని, ఏ ఒక్కరు కూడా ఈ పరీక్షకు గైర్హాజరు కాకూడదని ఆయన ట్వీట్ చేశారు. ఇలా పేదల నుంచి విద్యార్థులకు వరకు అన్ని విధాలుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్న నిజమైన హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. విద్యార్థుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్న సోనూసూద్‌కు విద్యార్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.