ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. మహిళల సింగిల్స్‌లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. అమెరికా అమ్మాయి సోఫియా కెనిన్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్ ను గెలిచింది. ఓ అనామకురాలిగా ఆస్ట్రేలియా ఓపెన్‌ లో అడుగుపెట్టిన కెనిన్‌.. శనివారం జరిగిన ఫైనల్స్‌లో గార్బిన్‌ ముగురుజాను 4-6, 6-2, 6-2 తేడాతో ఓడించి తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సాధించింది. టోర్నీ ఆరంభమయ్యే సమయానికి 12వ ర్యాంకులో ఉన్న సోఫియా కెనిన్ తనకంటే మెరుగైన ర్యాంకర్లను ఇంటికి పంపి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. కెనిన్‌ 21 ఏళ్ల 80 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. రష్యన్‌ స్టార్‌ ప్లేయర్‌ మారియా షరపోవా 2008లో 20 ఏళ్ల 283 రోజుల్లోనే సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో కెనిన్‌ ఈ ఘనత నమోదు చేసిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.

రష్యాలో జన్మించిన సోఫియా కెనిన్ అమెరికాలో స్థిరపడింది. గతంలో ఏనాడూ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటని ఈ చిన్నది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్‌ పోరులో కెనిన్‌ తొలి రౌండ్‌లో వెనుకబడింది. తర్వాత పుంజుకొని రెండు, మూడు రౌండ్లలో ఆధిక్యం సాధించి మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించింది.sofia kenin wins australian open title

తొలి గ్రాండ్‌ స్లామ్‌ సాధించిన సోఫియా కెనిన్‌ ట్రోఫీ అందుకున్నాక.. ఎగిరి గంతులు వేసింది. తన కల నెరవేరిందని.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఇదో ఉద్వేగభరితమైన ఘట్టమని, ఎవరికైనా కలలుంటే.. ప్రయత్నిస్తే అవి తప్పకుండా నెరవేరుతాయని అంది. ప్రైజ్ మనీ కింద సోఫియాకు దాదాపు రూ.20 కోట్ల నగదు లభించనుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.