వీరిదే 2019.. సోష‌ల్ మీడియాని హోరెత్తించారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Dec 2019 12:54 PM GMT
వీరిదే 2019.. సోష‌ల్ మీడియాని హోరెత్తించారు..!

ఎవ‌రి జీవితం ఎప్పుడు ఏ మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రికి తెలియ‌దు. కొంత‌మందిని అనూహ్యంగా అదృష్టం వ‌రిస్తే.. కొంత‌మంది ఎంత ప్ర‌య‌త్నించినా నిరాశే మిగులుతుంది. అయితే 2019 సంవ‌త్స‌రంలో కొంత‌మంది సోష‌ల్ మీడియా పుణ్య‌మానీ రాత్రికి రాత్రే స్టార్ల‌య్యారు. ఓ వ్యక్తి భయప‌డి.. న‌లుగురిని న‌వ్వించి స్టార‌యితే.. మ‌రోవ్య‌క్తి త‌న‌ దేశం ప‌ట్ల‌ ఉన్న‌ అభిమానం.. త‌న‌ను హీరోను చేసింది. ఓ ముస‌ల‌మ్మ సేవా ధృక్ప‌థం.. కొంత‌మందిని క‌దిలించి గుర్తింపు పొందడం... అలా కొంత‌మంది వ్యక్తులు ఈ ఏడాది సోష‌ల్ మీడియా వేదిక‌గా తమదైన ముద్ర వేశారు. ల‌క్ష‌ల‌ మంది అభిమానాన్ని సంపాదించారు.

గౌరవ్‌ అరోరా.. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కూ ఓ సామాన్య వ్య‌క్తి. అంత‌గా టాలెంటెడ్ కూడా కాదు. కానీ టిక్‌టాక్ పుణ్య‌మానీ బాగా పేమ‌స్ అయ్యాడు. ఎలా అంటే.. అతడు అచ్చం టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ లానే ఉండటం విశేషం. కోహ్లీ పోలికలతో గౌర‌వ్ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ వీడియోలు షేర్ చేయ‌డంతో నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. ఎవ‌రి వ్య‌క్తి అంటూ సోష‌ల్ మీడియాలో వెత‌క‌డం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే గౌర‌వ్.. 4 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఇలా గౌర‌వ్ త‌న రూపంతో ఒక్క‌సారిగా సెల‌బ్రిటీ అయ్యాడు.

విపిన్‌ సాహు.. ఓ వ్యక్తి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది పారాగ్లైడింగ్‌. అంత‌గా త‌న చేష్ట‌ల‌తో గుర్తుండిపోయేలా చేశాడత‌ను. విపిన్ సాహు కొద్ది రోజుల క్రితం పారాగ్లైడింగ్ చేద్దామ‌నే సాహ‌స కార్యానికి పూనుకున్నాడు. అయితే విపిన్‌ పారాగ్లైడింగ్‌తో గాల్లోకి ఎగరగానే భ‌య‌ప‌డ‌టం మొద‌లుపెట్టాడు. త‌న‌తో పాటు వ‌చ్చిన సీనియ‌ర్ గ్లైడ‌ర్‌ను రూ.500 ఇస్తా కిందకు దింపు అంటూ మొత్తుకోవ‌డం... ఎందుకు వ‌చ్చానా పారాగ్లైడింగ్ కు అంటూ తనను తాను తిట్టుకునే వీడియో అప్పట్లో నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఆ క్ష‌ణం నుండి విపిన్ నెటిజ‌న్లంద‌రికి సుప‌రిచితుడు. దీంతో అతడికి పారాగ్లైడింగ్‌ బాయ్‌గా పేరు వ‌చ్చింది.

రేనూ మండల్‌.. కొద్ది నెల‌ల క్రితం వ‌ర‌కూ రైల్వే స్టేషన్‌లో యాచకురాలు. ఇప్పుడు సంగీత ప్రియులెవ‌రికైనా రేనూ మండల్ అనే పేరు తెలియని వారుండరంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే ఆమె ఏకంగా రైల్వే ప్లాట్‌ఫాం నుంచి బాలీవుడ్‌ స్థాయికి ఎదిగింది. రైల్వే స్టేషన్‌లో యాచకురాలిగా జీవించే ఆమె.. తన తీయ‌ని స్వరంతో రైల్వే ప్లాట్‌ఫాంపై పాడిన పాట వైర‌ల్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌ సింగర్ క‌మ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిమేష్‌ రేషమ్మియా ఆమెతో ఓ ప్ర‌త్యేక ఆల్బ‌మ్ రూపొందించాడంటే అర్థం చేసుకోవ‌చ్చు ఆమె గొంతు ఎంత ప్రాచుర్యం పొందిందో.

కమలతల్‌.. తమిళనాడులోని వడివేలంపాలయంకు చెందిన ఈ వృద్ధురాలు ఇడ్లీ బామ్మగా జ‌నాల మ‌న‌సును దోచుకుంది. కేవలం రూ.1కే ఎంతో మందికి ఇడ్లీలను పెట్టి వారి ఆకలి తీర్చి త‌న సేవా థృక్ప‌దంతో అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. ఒక‌టి కాదు రెండు కాదు 35 ఏళ్లుగా ఆమె ఇలా ఇడ్లీలు అమ్ముతూనే ఉంది. ఇటీవల ఆమె గురించి నెటిజ‌న్లు ఇంటర్నెట్‌లో వీడియో పోస్ట్‌ చేయగా ఈ బామ్మ సేవా థృక్ప‌ధానికి జ‌నాలు ఫిదా అయిపోయారు. ఏకంగా ఆ బామ్మ పేరును ఇడ్లీ బామ్మగా మార్చేశారు. ఎంత‌గా అంటే ఈ బామ్మ ద‌యాగుణం మెచ్చిన‌ ప్రముఖ వ్యాపార దిగ్గ‌జం ఆనంద్‌ మహీంద్ర‌.. ఆమెకు ఎల్పీజీ సిలిండర్‌తో పాటు, ఆర్థిక సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చేంత‌గా..!

Image result for kamalathal

చిట్టి చెల్లి కోసం ఓ బుడతడు వంట... చేసిన వీడియో కూడా సోఝ‌ల్ మీడియాలో నెటిజ‌న్ల ఆదరణ చూర‌గొంది. తన చెల్లిని పక్కన కూర్చోబెట్టి తాను పొయ్యిపై వంట చేస్తుంటాడు. తిప్పికొడితే ఐదేళ్లు కూడా దాట‌ని ఆ బాలుడు ఎంతో అనుభ‌వం ఉన్న ప్రొపెష‌న‌ల్ చెఫ్‌లా వంట పని పూర్తి చేస్తాడు. త‌న చెల్లి ప‌క్క‌న ఆక‌లితో ఉంటే చెల్లి ఆక‌లి తీర్చ‌డం కోసం చ‌క‌చ‌కా వంట ప‌ని పూర్తిచేస్తుంటాడు. ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఆ చిన్న‌పిల్ల‌ల ప్రేమ‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు.పాక్ క్రికెట్ అభిమాని.. 2019 క్రికెట్ వ‌న్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ - పాకిస్తాన్ మ్యాచ్‌ అనంతరం ఓ సన్నివేశం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాక్ కంగుతింది. దీంతో ఆ వ్యక్తి క్రికెట‌ర్ల‌నుద్దేశించి బావోద్వేగానికి లోనై ‘రాత్రుళ్లు బర్గర్‌లు తిని మ్యాచ్ ఆడ‌టానికి వచ్చారు. మీరు క్రికెట్‌ను విడిచిపెట్టి బాక్సింగ్‌లోకి వెళ్లండి’ అంటూ షోయబ్‌ మాలిక్‌ను, సర్ఫరాజ్‌ అహ్మద్‌ల‌పై ఫైర‌య్యాడు. త‌ను అడిగిన తీరు నెటిజ‌న్ల‌ను కంట‌త‌డి పెట్టించ‌డంతో ఆ వ్యక్తి బాగా వైరల్‌ అయ్యాడు. దీంతో ఆ పాకిస్థానీ క్రికెట్ అభిమాని సోష‌ల్ మీడియాలో స్టార్‌ అయ్యాడు.Next Story
Share it