నిస్వార్థంగా ఒక్కటైన సోషల్ మీడియా ప్రేమ జంట..

By రాణి  Published on  7 March 2020 9:54 AM GMT
నిస్వార్థంగా ఒక్కటైన సోషల్ మీడియా ప్రేమ జంట..

సోషల్ మీడియా (ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్, వాట్సాప్) లో అపరిచితుల మోసపూరిత ప్రేమ మోజులో పడి ఎంతో మంది ఆస్తులు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. కానీ..ఈ ప్రేమ జంట మాత్రం తమ ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు ఈ జంట చాలా ఫేమస్ అయింది. ఎందుకో మీరూ చదవండి.

కేరళలో జరిగిన ఒక ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. ప్రేమ పెళ్లేనా అనుకోకండి. ఇది అంత సాధారణమైన పెళ్లి కాదు. వీరి మధ్య ప్రేమ అందం, ఆస్తి, కులం, వయస్సు చూసి పుట్టలేదు. దివ్యాంగుడైన యువకుడిని ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని ఇప్పుడు అందరిచేత ప్రశంసలందుకుంటోంది ఆ కేరళ యువతి.

కేరళలోని త్రిచూర్ జిల్లా తాజేఘాట్ కు చెందిన ప్రణవ్ కి ఆరేళ్లకిందట బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో ప్రణవ్ తుంటి కింద భాగానికి బలమైన గాయమవ్వడంతో నడవలేని పరిస్థితి వచ్చి..చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. తనకు సంబంధించిన ప్రతి పనికీ ఇతరుల సాయం తప్పనిసరి. అయినా జీవితంపై విరక్తి చెందని ప్రణవ్..అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్లేవాడు. ఆలయాల్లో జరిగే వేడుకలను వీడియోలు తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అప్పుడు తిరువనంతపురానికి చెందిన షహానా ఒక రోజు ప్రణవ్ వీడియోలు చూసి..అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. ఒకరోజు షహానా తన ప్రేమ విషయాన్ని ప్రణవ్ కు చెప్పి..పెళ్లి ప్రపోజల్ పెట్టింది. అందుకు ససేమిరా అన్న ప్రణవ్ షహానాను వేరొక పెళ్లి చేసుకోమని చెప్పాడు. తనను చేసుకుంటే సుఖంగా ఉండలేవన్నాడు. ప్రణవ్ మాట వినని షహానా..చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా..లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతా..నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా అని అడిగింది.

ఆమె అడిగిన దానికి "నువ్వంటే ప్రాణం... బట్" అంటూ ఏదో చెప్పబోతుంటే... "ఇంకేం చెప్పొద్దు... నేను మా పేరెంట్స్‌ని ఒప్పిస్తా" అంది షహానా. ఈ విషయం ఇంట్లో చెప్పగానే ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అందంగా ఉండి..అతన్ని పెళ్లిచేసుకుంటానంటావేంటి..వద్దు తల్లీ అని బ్రతిమాలారు. షహానా వినలేదు. నాకు లేని బాధ మీకెందుకు అని తల్లిదండ్రుల్ని ప్రశ్నించింది. ప్రేమంటే భౌతిక రూపంతో పనిలేదని..మనసులు కలిసేదే నిజమైన ప్రేమ అని చాటి చెప్పింది. కూతురు ప్రణవ్ ను అంతలా ఇష్టపడుతుంటే వారు కాదనలేకపోయారు. అలా గత నెల ఫిబ్రవరి 3వ తేదీన ఈ సోషల్ మీడియా ప్రేమ జంట ఒక్కటైంది. పెళ్లి సమయంలో తీసిన వీడియో నెట్టింట్లో పోస్ట్ చేయడంతో..వీరి ప్రేమ హాట్ టాపిక్ అయింది. వీడియో చూసిన వారంతా..ఆ ఆదర్శ జంటను ఆశీర్వదిస్తున్నారు.

Next Story