తెలంగాణలో 3,306 పాము కాటు కేసులు..

By Newsmeter.Network  Published on  26 Dec 2019 6:58 AM GMT
తెలంగాణలో 3,306 పాము కాటు కేసులు..

పాము కాటు దేశవ్యాప్తంగా వందలాది ప్రాణాలను తీస్తోంది. 2018 లో దేశవ్యాప్తంగా 1,64031 పాము కాటు సంఘటనలు నమోదయ్యాయి. వీటి వల్ల 885 మంది చనిపోయారు. మన తెలంగాణలో 3306 పాము కాటు కేసులు నమోదైతే, తొమ్మిది మంది చనిపోయారు. ఈ వివరాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధీనంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటలిజెన్స్ సంస్థ వెల్లడించింది. అత్యధిక సంఖ్య లో పాము కాటు మరణాలు పశ్చిమ బెంగాల్ లో సంభవించాయి. ఆ తరువాత వరుసలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు ఉన్నాయి. బెంగాల్ లో 263 మంది చనిపోగా, ఆంధ్రప్రదేశ్ లో 117, ఒడిశా లో 98 మంది పాముకాటు వల్ల చనిపోయారు. తెలంగాణ పదమూడో స్థానంలో ఉంది.

పాము కాటు వల్ల సాధారణంగా సమశీతోష్ణ దేశాల్లోని గ్రామీణ జనాభా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. రైతులు, రైతు కూలీలు, తోటల్లో పనిచేసే వారు, పశుపాలకులు, కూలీలు ప్రధానంగా పాము కాటు బారిన పడతారు. నేతపై పడుకునేవారు కూడా పాము కాటు బారిన పడుతూ ఉండటం కద్దు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ కార్యదర్శి అవినాశ్ విశ్వనాథన్ కథనం ప్రకారం మగవారే మహిళల కన్నా ఎక్కువగా పాముకాటు బారిన పడతారు. అరవై శాతం మందికి కాలి మీద పాములు కాటువేస్తే, ఇరవై శాతం చేతుల పై కాటు వేస్తాయి. మిగతా ఇరవై శాతం శరీరంలోని ఇతర బాగాలపై కాటు వేస్తాయని అధ్యయనాల్లో తేలింది. ఎక్కువగా పగలు గడ్డి, కొమ్మలు, ఆకులు సేకరిస్తుంటే పాము కాట్లు సంభవిస్తాయి. గమ్ బూట్లు వేసుకోవడం ద్వారా పాము కాట్లను నివారించవచ్చు. అదే విధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పాము కాట్లు ఎక్కువగా సంభవిస్తాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే యాంటీ స్నేక్ వెనమ్ సీరమ్ ను తగినంత మోతాదులో ఉంచుకోవాలని ఆదేశించింది. స్థానికంగా కొనుగోలు చేసైనా అందుబాటులో ఉంచాలని సూచించింది.

మొత్తం సరీసృపాలలో (పాకే జంతువులు) 66 శాతం మాత్రమే విషపూరితమైనవని, కట్ల పాము, తాచు పాము, క్రెయిట్ వంటి విషం కలిగిన పాములు వ్యవసాయ భూముల్లో, చెత్తలో, నిర్మాణాలు జరిగే చోట్లలో నివసిస్తాయి. పాములు తమ విషాన్ని వృథా చేయదలచుకోవు. కేవలం ఆత్మ రక్షణ కోసమే అవి కాటు వేస్తాయని అవినాశ్ అంటారు. పాముకాటు బారిన పడిన వారు మంత్ర వైద్యుల వద్దకు వెళ్లడానికి బదులు నిపుణులైన డాక్టర్ల వద్దకు వెళ్లడం మంచిదని ఆయన సూచించారు.

Next Story
Share it