మగాళ్లు పొగాకు తాగడం మానేస్తున్నారోచ్....!!

By రాణి  Published on  20 Dec 2019 7:59 AM GMT
మగాళ్లు పొగాకు తాగడం మానేస్తున్నారోచ్....!!

పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్.... అన్నాడు ఒకాయన. దున్నపోతులుగా పుట్టినా ఫరవాలేదు కానీ సిగరెట్ మాత్రం తాగబోమంటున్నారు మగవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో 19 ఏళ్ల చరిత్రలో తొలిసారి పొగత్రాగే వారి సంఖ్య తగ్గిందని తేలింది. అంటే పొగత్రాగడాన్ని మాన్పించే దిశగా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.

ప్రతి ఏడాది ధూమపానం చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉండేది. కానీ గతేడాది మాత్రం పొగాకు ప్రియుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని, ఇది ప్రధానంగా ప్రభుత్వాలు పొగాకు సేవనంపై తీసుకుంటున్న కఠిన చర్యల వల్లే జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడ్హనోమ్ ఘెబ్రెయెసెస్ పేర్కొన్నారు. ప్రతి ఏటా పొగాకును వివిధ రూపాలలో తీసుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల దాదాపు ఎనభై రెండు లక్షల మంది చనిపోతున్నారని నివేదిక వెల్లడించింది. వీరిలో 70 లక్షల మంది ప్రత్యక్షంగా పొగాకే సేవించి చనిపోతున్నారు. మరో పన్నెండు లక్షల మంది మిగతా వారు సేవించి వదిలే పొగ ను పీల్చడం వల్ల (ప్యాసివ్ స్మోకింగ్) చనిపోతున్నారు.

2000 వ సంవత్సరంతో పోలిస్తే 2018 లో అరవై లక్షల మంది పొగాకు సేవించడం మానేశారు. 2000 లో పొగాకు సేవించేవారి సంఖ్య 139.72 కోట్లు ఉండగా, 2018 లో 130 కోట్లకి పడిపోయింది. గతంలో పొగాకు సేవించే వారి సంఖ్యలో తగ్గుదల ప్రధానంగా మహిళలు, యువతులు పొగతాడగం మానేయడం వల్ల కనిపించేది. ఈ సారి మగవారు పొగత్రాగడం మానేస్తున్నారు. ఇది మంచి పరిణామం. 2025 నాటికి మరో 2.70 లక్షల మంది పొగాకు తాగడం మానేసే అవకాశాలున్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. బీడీ, సిగరెట్, చుట్ట, హుక్కా వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఎలక్ట్రానిక్ సిగరెట్లను చేర్చలేదు.

Next Story