పొగ తాగేవాళ్లకు ఇకపై ఉద్యోగాల్లేవ్..!
By Newsmeter.Network Published on 4 Jan 2020 11:58 AM ISTముఖ్యాంశాలు
- యూఎస్ లో పెరుగుతున్న నో నికోటిన్ స్పృహ
- పొగరాయుళ్లకు చెక్ పెట్టిన యూహాల్ ఇంటర్నేషనల్
- ఇకపై పొగరాయుళ్లకు ఉద్యోగాలు ఇవ్వకూడదని తీర్మానం
- పొగరాయుళ్లను ఇంటర్వ్యూలకీ అనుమతించరు
- ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకోసమే పాలసీ అమలు
- ఆరోగ్య పరిరక్షణకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
ఫినిక్స్ : యూహాల్ ఇంటర్నేషనల్ అనే యూఎస్ కంపెనీ ఇకపై పొగతాగేవాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది. నికోటిన్ ను ఏ రకంగా వాడేవాళ్లైనా, ఆఖరికి ఈ సిగరెట్లను ఊదేసేవాళ్లైనా సరే కనీసం ఇకపై వాళ్లను ఇంటర్యూలకు కూడా పిలవకూడదని ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది.
అమెరికాలో బాగా పేరుపొందిన ట్రక్ అండ్ ట్రైలర్ రెంటల్ కంపె నీకూడా పూర్తి స్థాయిలో నికోటిన్ వాడకం దారులతో లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1, 2020నుంచి అమలుకాబోతోంది. యూఎస్ లో ఈ కంపెనీ లావాదేవీలు మొత్తం 20 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తంగా ఆ రాష్ట్రాలన్నింటిలోనూ నికోటిన్ వాడకందారులకు ఎలాంటి ఉద్యోగం ఇచ్చే ప్రశ్నేలేదని ఈ కంపెనీ గట్టిగా తీర్మానించుకుంది.
అలబామా, అలాస్కా, డిలవేర్, ఫ్లోరిడా, జార్జియా, హవాయి, ఇడాహో, లోవా, కన్సాస్, మేరీల్యాండ్, మసాచుయేట్స్, మిషిగాన్, నెబ్రాస్కా, పెన్సుల్వేనియా, టెక్సాస్, ఉతహ్, వెర్మాంట్, వర్జీనియా, వాషింటన్ రాష్ట్రాల్లో ఈ కంపెనీ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం వచ్చే నెల మొదటిరోజునుంటే నికోటిన్ బ్యాన్ స్వచ్ఛందంగా అమలవుతుంది.
ఈ పాలసీ రాకముందు ఉద్యోగాల్లో చేరినవారికి మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని కంపెనీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒత్త అరిజోనాలోనే ఈ కంపెనీ ఉద్యోగులు దాదాపు 4 వేలమందికి పైగా ఉన్నారనీ, మొత్తంగా ఇరవై రాష్ట్రాల్లో ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 30 వేలు దాటిపోతుందనీ అధికారులు తెలిపారు.
ఈ ఇరవై రాష్ట్రాల్లోనూ నికోటిన్ వాడేవాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదన్న అధికారిక నిబంధనలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయి. కాబట్టి కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి చట్టపరమైన ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవు. వీటిలో 17 రాష్ట్రాల్లో అయితే యజమానులు ఉద్యోగులకు నికోటిన్ వాడుతున్నారా లేరా అని వైద్య పరీక్షలు చేయించే అధికారం కూడా రాజ్యంగబద్ధంగా ఉంది. అయితే అలా వైద్య పరీక్షలు చేయించే ఉద్దేశం మాత్రం ఇప్పట్లో లేదని సంస్థ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.
నికోటిన్ ఫ్రీ హైరింగ్ పాలసీవల్ల ప్రొఫెషనలిజం మరింత పెరుగుతుందని, ఆరోగ్యవంతంగా ఉన్న ఉద్యోగులు మరింత అంకితభావంతో కంపెనీలు సేవలు అందించడమేకాక, వ్యక్తిగతంగా వారి జీవితాల్లోనూ ఆనందాన్ని పండించుకోగలుగుతారని సంస్థ బలంగా నమ్ముతోంది. ఈమేరకు కొంత కాలంగా హెచ్చరికలు చేస్తూనే ఉన్న ఈ సంస్థ ఇప్పుడు నికోటిన్ ఫ్రీ హైరింగ్ పాలసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
వెల్ నెస్ ఫీని తొలగించడంద్వారా ఈ సంస్థ తన ఉద్యోగులకు నికోటిన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు లేదా పూర్తి స్థాయిలో మానేసేందుకు సహాయం చేయాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగులు నికోటిన్ వాడకాన్ని మానేయగలుగుతారనీ, దానివల్ల వైద్య ఖర్చులుకూడా బోలెడంత మిగులుతాయనీ ఈ సంస్థ ఉన్నాతాధికారులు అంటున్నారు.
నో నికోటిన్ పాలసీ..
అరిజోనాలోని తమ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఆరోగ్యంపట్ల, ఫిట్ నెస్ పట్ల శ్రద్ధను పెంచేందుకు కంపెనీ కొత్తగా ఓ హెల్త్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నికూడా ప్రారంభించింది. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే కొంత సమయాన్ని కేటాయించుకుని ఉద్యోగులు ఈ సెంటర్ కి వెళ్లి వ్యాయామం, ప్రాణాయామం లాంటివి చేసుకుని రావడానికి వీలు కల్పించారు.
నో నికోటిన్ పాలసీని అమలు చేయడంవల్ల కొన్ని ఆసుపత్రులకు, హెల్త్ బిజినెస్ సెంటర్లకు పూర్తి స్థాయిలో ఆదాయం పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతే తమకు చాలా విలువైన అంశమని యూహాల్ ఇంటర్నేషనల్ సంస్థ చెబుతోంది.
1985 నుంచీ అలస్కా ఎయిర్ లైన్స్ లో నో నికోటిన్ పాలసీ అమలవుతోంది. దీనివల్ల ఆ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడిందని చెబుతోంది. పైగా విమానాల్లో, విమానాశ్రయాల్లో చుట్టూ పొగతాగుతూ కనిపించే పొగరాయుళ్ల సంఖ్య పూర్తిగా పడిపోయినందున వాళ్లు విడిచిపెట్టే పొగవల్ల ఇతరులకు కలిగే అనర్థాలుకూడా పూర్తి స్థాయిలో దూరమయ్యాయని అలస్కా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు చెబుతున్నారు.
టొబాకో లేదా మెంథాల్ తోకూడినవికాక కేట్రిడ్జ్ తో కూడిన ఈ సిగరెట్లు, ఇవాపరేటర్లు ఏవీ ప్రభుత్వంనుంచి ప్రత్యేకమైన అనుమతి లేకుండా వాడేందుకు వీలులేదని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. మామూలు సిగరెట్లతో పోలిస్తే వ్యక్తులకుగానీ, పర్యావరణానికిగానీ ఈ సిగరెట్లవల్ల వందరెట్లు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని, వాటి వాడకంవల్ల యువత పూర్తిగా నిర్వీర్యమైపోతుందని భావించి వాటిని నిషేధిస్తూ పటిష్టమైన చట్టబద్ధమైన ఏర్పాట్లు చేశారు.