స్లమ్ నుంచి స్లమ్ దాకా ఒక మిలియనీర్ ప్రయాణం
By రాణి Published on 27 Jan 2020 6:03 AM GMTఅదృష్టం అందలం ఎక్కించింది. భాగ్యం బురదలోకి తోసింది. ఆ పిల్లవాడి కథ అక్షరాలా ఇంతే. పదేళ్ల వయసులోనే అమెరికా నుంచి అదృష్టం తన్నుకొచ్చింది. ముంబాయిలోని మూడువందల మంది మురికివాడల పిల్లల్లోనుంచి అతడిని ఆ అమెరికన్ ఎంపిక చేసుకున్నాడు. తన సినిమాలో హీరో తమ్ముడి వేషం ఇచ్చాడు. ఆ సినిమా ప్రపంచమంతటా సంచలనం సృష్టించింది. ఆస్కార్ల పంట పండింది. కోట్లాది భారతీయుల్లో ఎవరికీ దక్కని అదృష్టం ఆ పిల్లవాడికి దక్కింది. ఆస్కర్ వేదిక మీద సగర్వంగా నిలబడ్డాడు అతడు.
ఆ పిల్లవాడి పేరు అజరుద్దీన్ ఇస్మాయిల్. ఆ అమెరికన్ పేరు డానీ బాయిల్. ఆ చిత్రం పేరు స్లమ్ డాగ్ మిలియనీర్. అప్పట్లో ఈ మురికివాడల నివాసికి ఆస్కర్ విజేత ఏ ఆర్ రహ్మాన్, నిర్మాత, దర్శకులకి చెందిన జయహో ట్రస్ట్ 49 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ను వెస్ట్ సాంటాక్రుజ్ లోని అనురాగ్ ప్లాజాలో కొని బహుమతిగా ఇచ్చింది. వాళ్లకు మైనారిటీ తీరేవరకూ ట్రస్ట్ ఆధీనంలోనే ఉన్న ఇళ్లను తరువాత వారి పేరిట బదలాయించారు.
స్లమ్ డాగ్ మిలీనియర్ స్టార్ ఇప్పుడిలా..
అది పన్నెండేళ్ల కిందటి మాట! పన్నెండేళ్ల తరువాత అజరుద్దీన్ ఇస్మాయిల్ కథ చూస్తే ఆకాశం ఎత్తుల నుంచి అగాథాల లోతుకు వెళ్లిపోయినట్టుగా ఉంది. అనురాగ్ ప్లాజా ఫ్లాట్ ను అమ్మేసుకుని, అజరుద్దీన్ కుటుంబం ఇప్పుడు మళ్లీ గతంలో నివసించిన గరీబ్ నగర్ కి దగ్గర్లోని మురికివాడలో పదడుగుల పొడవు, పదడుగుల వెడల్పు ఉండే ఒకే గదిలో అద్దెకు ఉంటోంది. సినిమా విడుదలైన ఏడాదికి తండ్రికి టీబీ వచ్చింది. దానికి బోలెడు ఖర్చయింది. ఆయన చనిపోయారు. అప్పుడు కుటుంబం దిక్కులేక ఇల్లు అమ్ముకుని అప్పులు తీర్చుకుంది. కొంత అవసరాలకు వాడుకుంది. ఇప్పుడు మళ్లీ మురికివాడలో బతకాల్సి వస్తోంది.
అప్పట్లో మురికివాడలోనే ఉన్నా, ఇప్పుడు అజర్ కు మురికివాడల బ్రతుకు పడటం లేదు. తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు. అయినా అతను సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. అజహర్ మైనారిటీ తీరే వరకూ ట్రస్ట్ వారికి నెలకు తొమ్మిదివేలు పంపించేది. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. అజర్ తల్లి కథనం ప్రకారం అజర్ చదువులను వదిలేశాడు. చిన్నపాటి వ్యాపారం చేశాడు. అందులో నష్టం వచ్చింది. తరువాత చెడుసావాసాలు పట్టాడు. నెమ్మదిగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఏడుగురు కుటుంబ సభ్యులతో ఆ చిన్ని గదిలో ఉంటున్నాడు. “మళ్లీ డానీ బాయిల్ కరుణిస్తే బాగుండు”నని అతని తల్లి వేడుకుంటోంది.
అజర్ లాంటి కథే రూబినా అలీ ఖురేశీది. రూబినా అదే సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రను పోషించింది. ఆమెకి కూడా ఒక ఫ్లాట్ ను జయహో ట్రస్ట్ ఇచ్చింది. ఆమె ఇల్లును అమ్ముకోలేదు. ప్రస్తుతం బీఏ చదువుతూ, మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తూ ఉంది. ఆమె తండ్రికి కూడా క్షయ వ్యాధి వచ్చింది. కానీ ఆమె తట్టుకుని నిలబడింది. “నా జీవితాన్ని మార్చిన డానీ బాయిల్ అంకుల్ కి కృతజ్ఞతలు” అని రోజూ ఆయన్ని తలచుకుంటుంది రూబీనా. “ఆయన వల్లే నేను చదువుకున్నాను.” అంటుంది ఆమె.