నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు..!
By సుభాష్ Published on 4 March 2020 1:51 PM ISTప్రస్తుత కాలంలో మనిషికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనారోగ్య సమస్యలు మనమే కొనితెచ్చుకుంటున్నాము. నిత్యం మనం సరైన టైముకు భోజనం చేయకపోవడం, వ్యాయామం చేయడం, అలాగే తగినన్ని గంటల పాటు కూడా నిద్రించకపోవడంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇవన్ని సక్రమంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం లేదు. దీంతో నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారు. అయితే ఎవరైనా సరే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయరాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
మనం తినే ఆహారంలో కూడా సమయ పాలన పాటించాల్సి ఉంటుంది. సమయ పాలన లేకుండా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. కొందరు నిద్రించే ముందు భోజనం చేస్తుంటారు. ఇక కొందరు కొవ్వు పదార్థాలు, కారం, మసాలాలు కలిగిన ఆహారాలను బాగా తిని వెంటనే నిద్రపోతుంటారు. అలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ, తలతిరగడం, అధికంగా బరువు పెరగడం, హార్ట్ ఎటాక్‌లు రావడం, డయాబెటిస్ వంటి సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు. అందుకే నిద్రించే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు. అలాగే తిండికి, నిద్రకు మధ్య కనీస వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.
అలాగే మద్యం సేవించి నిద్రించడం వల్ల నిద్రలేమి సమస్య బారిన పడాల్సి వస్తుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాత్రి సమయంలో చక్కగా నిద్ర పట్టాలంటే మద్యానికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు.
దగ్గు, జలుబు, అలర్జీల కోసం వేసుకునే మందులు కూడా కొందరిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. ఆ మందులను డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఆ మందులను వాడినట్లయితే దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలు రావడంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. నిద్రలేమి నుంచి బయటపడాలంటే ఆ మందులను వేసుకోవడం మానేయాలి.
ఫోన్, టీవీ, కంప్యూటర్‌లకు దూరంగా..
రాత్రి సమయంలో ఫోన్, టీవీ, కంప్యూర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. లేదంటే నిద్రలేమి సమస్య బారిన పడడమే కాకుండా ఎన్నో ఆనారోగ్య సమస్యలు వచ్చి చేరుతాయి. అలాగే మనకు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.