భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కల్యాణానికి ముందుగానే టికెట్ల బుకింగ్‌ జరుగుతుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఆరుబయట రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈ సారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు లేదు. కరోనా మహమ్మారే దీనికి కారణం.

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈనెల 31 వరకు స్కూల్‌, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లను బంద్ చేసింది. ఎక్కువ మంది ఒకే చోట ఉండే కార్యక్రమాలను రద్దు చేసింది. స్వామి వారి కల్యాణం అంటే వేల సంఖ్యలో భక్తులు వస్తారు. కావున.. కరోనా వైరస్‌ ప్రభలే అవకాశం ఉండడంతో ఈ సారి స్వామి వారి కల్యాణానికి భక్తులను అనుమతించడం లేదు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా వైరస్‌ కేసులు ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

కేవలం అర్చకులు మాత్రమే శాస్ర్తోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించనున్నారు. రామయ్య కల్యాణం భాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు. రామయ్య కల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకుని వచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఈసారి ఎవరు తీసుకు వస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story