అక్కడికి మహిళలు వెళ్లొద్దు : గాయకుడి విజ్ఞప్తి
By రాణి
చెన్నై : మహిళలు శబరిమలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు. గతంలో సుప్రీంకోర్టు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి మహిళలకు అనుమతివ్వాలని తీర్పునిచ్చిన సంగతి విధితమే. కోర్టు తీర్పుతో చాలామంది మహిళలు అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గాయకుడు ఏసుదాసు మహిళలు శబరిమల గుడికి వెళ్లడంపై స్పందించారు. ''ఒకప్పుడు అయ్యప్పస్వామి మాల దీక్షలో ఉన్న భక్తులు కనీసం వారి ఇంటిలోని ఆడవాళ్లనే చూసేవారు కాదు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనమూ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం తీర్పుతో మహిళలు అక్కడికి వెళ్తే స్వాముల దీక్ష భగ్నమయ్యే అవకాశం ఉంది. మహిళలను చూస్తే స్వాముల మనసులో చెడు భావన కలిగే అవకాశం ఉంది. అందుకే మహిళలు శబరిమలకు వెళ్లొద్దని వేడుకుంటున్నా. మీరు వెళ్లేందుకు ఎన్నో ఆలయాలున్నాయి కదా. దయచేసి స్వాముల దీక్షను భగ్నం చేయకండి'' అని ఏసుదాస్ విజ్ఞప్తి చేశారు.