సర్కార్ కీలక నిర్ణయం: జూన్ 1 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు
By సుభాష్ Published on 21 April 2020 12:45 PM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బుసలు కొడుతోంది. చైనా జన్మస్థలంగా ఉన్న ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు 200పైగా దేశాలకు విస్తరించింది. మృత్యువును వెంటాడుతోంది. కరోనా బారిన ఎందరివో ప్రాణాలు పోతున్నాయి. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా సింగపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కాగా, గతంలో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పొడిగింపును తగ్గించుకుని నాలుగు వారాలు మాత్రమే పొడిగించింది. దీంతో మే 4వ తేదీతో లాక్‌డౌన్ ముగియనుండగా, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా జూన్1 వరకూ పొడిగిస్తున్నట్లు దేశ ప్రధాని హ్పేన్ లూంగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
దక్షిణ ఆసియా, చైనా నుంచి సింగపూర్‌కు వచ్చిన చాలా మంది వలస కార్మికుల కారణంగానే దేశంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు
ఇక వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం 9వేల 125 కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా..
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేసుల సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పటి వరకూ పాజిటివ్ కేసులు 25 లక్షలకు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. లక్షా 70 వేల వరకూ మృతి చెందారు. ఈ ప్రాణాంతక వైరస్ ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య స్వల్పంగానే ఉన్నా.. మున్ముందు విశ్వరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.