అసలే రోహిత్ గాయంతో సతమతమవుతున్న టీమిండియాకు మరో భారీ షాక్..!
By సుభాష్ Published on 3 Feb 2020 2:15 PM GMT
కివీస్‌తో జరిగిన చివరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు మరో గట్టి షాక్ తగిలింది. సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న ఆటగాళ్లకు.. చివరి మ్యాచ్‌లో గాయపడి రోహిత్ వన్డే సిరీస్‌కు దూరమవగా.. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. వివరాళ్లోకెళితే.. చివరి టీ20లో స్లోఓవర్ రేట్ కారణంగా ఐసీసీ.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది.
ఐసీసీ రూల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేదంటే ఒక్క ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. కాగా, టీమిండియా చివరి టీ20లో ఒక ఓవర్ ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రోన్, షాన్ హేగ్ ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు.
అంతకుముందు జరిగిన నాలుగో టీ20లోనూ టీమిండియా రెండు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం పెనాల్టీ విధించారు. ఈ మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేటు కారణంగా కోత విధించడంతో ఆటగాళ్ల ఆదాయానికి భారీగా గండిపడనుంది.