శివప్రసాద్‌ను మరువలేం...రాజకీయాల్లో తనదో శైలి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2019 10:25 AM GMT
శివప్రసాద్‌ను మరువలేం...రాజకీయాల్లో తనదో శైలి.!

  • మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
  • చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న శివప్రసాద్
  • శివప్రసాద్ మృతితో చిత్తూరు జిల్లాలో విషాదం
  • శివప్రసాద్ మృతికి సంతాపం తెలిపిన సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత బాబు

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్‌(68) ఇక లేరు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

24 గంటల చికిత్స తరువాత కూడా ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదు. శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ.. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నుంచి తేరుకోకముందే..మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం టీడపీ కార్యకర్తలను కోలుకోకుండా చేసింది. ఆయన మరణవార్త విన్న వెంటనే ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.

వైద్య వృత్తి నుంచి సినీరంగం వైపు

నారమల్లి శివప్రసాద్ 1951, జూలై 11న చిత్తూరు జిల్లా పుట్లపల్లిలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన తిరుపతిలోనే డాక్టర్‌గా పని చేసారు. వృత్తిలో కొనసాగుతూనే నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006లో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది.

రోజాను పరిచయం చేసింది శివప్రసాదే..!

డాక్టర్ ఎన్ శివప్రసాద్ కు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ప్రముఖ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్ కే రోజాను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. పలువురు వర్ధమాన నటులకు జీవితాన్ని ప్రసాదించారు.

ఉద్యమంలో తనదో శైలి :

శివ ప్రసాద్ రాష్ట్ర విభజన , ప్రత్యేక హోదా ఉద్యమం సమయంలో పార్లమెంట్ భవనం ముందు అల్లూరి సీతారామరాజు, జవహర్ లాల్ నెహ్రూ, హిట్లర్, స్వామి వివేకానంద ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులను మొదలుకుని.. గ్రామీణ వేషధారణలతో క్లిష్టమైన సమస్యలను కూడా ఆకట్టుకునేలా చెప్పగలిగారాయన.

చంద్రబాబుకు శివప్రసాద్ అత్యంత ఆప్తుడు. ఇద్దరిది ఒకే జిల్లా. చంద్రబాబు ప్రోత్సాహంతోనే శివప్రసాద్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారని జిల్లావాసులు అంటుంటారు. చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప రెడ్డిపై పోటీ చేసిన శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Next Story