పిల్లలు కనడానికి ఒక వయసు ఉంటుంది: బాలీవుడ్‌ నటి

By సుభాష్
Published on : 29 Feb 2020 3:14 PM IST

పిల్లలు కనడానికి ఒక వయసు ఉంటుంది: బాలీవుడ్‌ నటి

పిల్లల్ని కనడానికి ఒక వయసు ఉంటుందని బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తన రెండో బిడ్డ పుట్టిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. గతంలో ఆమె 37 ఏళ్ల వయసులోనే తన తొలిబిడ్డకు జన్మనిచ్చినప్పుడు పిల్లలను కనడానికి ఒక వయసు ఉంటుందని, తాను ఇంత ఆలస్యంగా పిల్లలు కనాలని ఏనాడు కూడా అనుకోలేదని తెలిపినట్లు హిందూస్తాన్‌ టైమ్స్‌ ప్రతిక పేర్కొంది. పిల్లలను కనాలనుకునేవారు తమ వయసును దృష్టిలో ఉంచుకోవాలని ఆమె కామెంట్‌ చేశారు. కాగా, శెల్పాశెట్టి చేసిన కామెంట్‌కు మేఘన సంత్‌ అనే ఫెమినిస్ట్‌ రచయిత, జర్నలిస్టు స్పందించారు. 'పిల్లల్ని ఏ వయసులోనైనా కనవచ్చు. అండాశయానికి కాల పరిమితి అంటూ ఏమి ఉండదు. కాల పరిమితి కేవలం ఆలోచన ధోరణికి మాత్రమే ఉంటుంది' అంటూ మేఘన ట్విట్‌ చేశారు. 'సారీ.. శిల్పాశెట్టి నేను మొదటి బిడ్డను 37 ఏళ్ల వయసులో, రెండో బిడ్డను 39 ఏళ్ల వయసులో కన్నాను. కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్‌ తలెత్తలేదు. మహిళలు ఒక నిర్ణీత వయసులోనే పిల్లలను కనాలనే అర్ధరహిత వాదనలను ప్రచారం చేయకండి' అంటూ ఆమె ట్విట్ చేశారు.

Shilpa Shetty Comments

కాగా, గత సంవత్సరం ఏపీలో 73 ఏళ్ల వయసున్న ఒక మహిళ ఐవీఎఫ్‌ విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనడానికి ఒక నిర్ణీతమైన వయసు ఉందా..? అనే అంశం చర్చకు వచ్చింది.

ఎక్కువ 15-19 ఏళ్ల అమ్మాయిలే గర్భం దాల్చుతున్నారు

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటా 15 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న సుమారు కోటి 20 లక్షల మంది అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ వయసులో సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువ శాతం ప్రసూతి మరణాలేనని కూడా ఆరోగ్య సంస్థ ప్రకటించింది. నెలసరి వస్తున్న స్త్రీలు పిల్లలను ఎప్పుడైనా కనవచ్చని అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ అబ్‌స్ట్రిషియన్స్‌ అండ్‌ గైనాకాజిస్ట్స్‌ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కాగా, పిల్లల్ని కనే సామర్థ్యం 32 సంవత్సరాల తర్వాత క్రమంగా తగ్గిపోతూ వస్తుందని తెలిపింది.

ఆలస్యంగా పిల్లలను కంటే..

పిల్లలను ఆలస్యంగా కనడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయని చెబుతోంది అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ అబ్‌స్ట్రిషియన్స్‌ అండ్‌ గైనాకాజిస్ట్స్‌. పిల్లల్లో డౌన్‌ సిండ్రోమ్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ప్రీ ఎక్లాంప్సియా, జెస్టేషనల్‌ డయాబెటిస్‌, నెలలు నిండకముందే పిల్లలు పుట్టే ప్రమాదం కూడా అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది.



Next Story