గ‌బ్బ‌ర్ 'రీఎంట్రీ' ఇస్తున్నాడు.. వ‌స్తూ వ‌స్తూనే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Dec 2019 2:21 AM GMT
గ‌బ్బ‌ర్ రీఎంట్రీ ఇస్తున్నాడు.. వ‌స్తూ వ‌స్తూనే..

టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. ఈ ఏడాది తాను వేలి గాయంతో పాటు మెడ కండరాల నొప్పితో.. కంటి గాయంతో బాధ‌ప‌డుతూ జ‌ట్టుకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే.. వచ్చే ఏడాది శ్రీలంక, ఆసీస్‌లతో సిరీస్‌ల్లో భాగంగా ధ‌వ‌న్.. భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కొత్త సంవత్సరాన్ని తాజాగా ఆరంభిస్తానని అన్నాడు. గాయాల బారిన‌ప‌డి తాను జ‌ట్టుకు దూర‌మైన క్ర‌మంలో ఓపెన‌ర్ గా రాహుల్ రాణించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. ఇవన్నీ తన ఆటపై ఏమాత‍్రం ప్రభావం చూపవ‌ని.. ఈ క‍్రమంలోనే తన క్లాస్‌ శాశ్వతం అంటూ ధ‌వ‌న్ అన్నాడు. శ్రీలంక-ఆసీస్‌ల సిరీస్‌లకు ఎంపిక కావడం సంతోషం కాదన్నాడు. ఇది నాకు కొత్త ఆరంభమ‌ని తెలిపాడు.

ఈ సంవ‌త్స‌రంలో కంటి గాయం, మోకాలి గాయం, మెడ నొప్పితో బాధ పడ్డా. దాంతో పలు సిరీస్‌లకు దూరమయ్యాను. కానీ నేను లేని లోటును కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేశాడని అన్నాడు. వచ్చిన అవకాశాన్ని స‌రిగ్గా వినియోగించుకున్నాడని తెలిపాడు. రాహుల్ రాణించాడం శుభపరిణామని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

కొత్త ఏడాదిలో సత్తాచాటడంపైనే నేను దృష్టి పెట్టాన‌ని తెలిపాడు. ఆట‌లో బాగంగా గాయాలు సహజంగానే అవుతూ ఉంటాయని.. వాటిని కూడా స్వీకరించాలని ధ‌వ‌న్ అన్నాడు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాన‌ని. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని అన్నాడు. గాయాల కార‌ణంగా ఆడటం-ఆపేయడం చేస్తూ ఉన్నా.. ఇది నా ఆటపై ప్రభావం చూపదని అన్నాడు. నేను నా ఆటను మరిచిపోలేదని.. నా క్లాస్‌ అనేది శాశ్వతమ‌ని.. నేను పరుగులు సాధిస్తాన‌ని ధవన్‌ పేర్కొన్నాడు.

Next Story
Share it