మరో దారుణం: శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌, హత్య

By సుభాష్  Published on  26 Oct 2020 10:40 AM GMT
మరో దారుణం: శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌, హత్య

మహబూబాబాద్‌ కిడ్నాప్‌ ఘటన మరువక ముందే మేడ్చల్‌ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. శామీర్‌పేటలోబ ఆలుడు అథియాన్‌ (5) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. శామీర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు పక్కన బాలుడి మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. శామీర్‌పేట సీఐ సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం. శామీర్‌పేటకు చెందిన సయ్యద్‌ ఉసేన్‌, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్‌ స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 15న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, బాధితులు ఉంటున్న ఇంటిపక్కనే బీహార్‌కు చెందిన సోన్‌సోన్‌ (26) అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు.

మూడు రోజుల కిందట తాను దొంగిలించిన ఫోన్‌తో ఇంటి యజమానికి ఫోన్‌ చేసి రూ.15 లక్షలు ఇస్తేనే బాలుడిని అప్పగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఇంటి యజమాని, బాధితులు పోలీసులకు సమాచారం అందించగా, ఫోన్‌ కాల్‌ ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా బాలుడిని చంపేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. ఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. బాలుడిని చంపి 11 రోజులు గడవడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఇటీవల మహబూబాబాద్‌లో దీక్షిత్‌రెడ్డి అనే 9 ఏళ్ల బాలున్ని కిడ్నాప్‌ చేసి, హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేయడంతో మరింత సంచలనం రేపుతోంది. ఇలా పిల్లలను కిడ్నాప్‌ చేసి హత్య చేస్తున్నవారిని వెంటనే ఊరి తీయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story
Share it