ప్రముఖ బుల్లితెర నటి ఆత్మహత్య ..
By Newsmeter.Network Published on 25 Jan 2020 11:33 AM IST
ఇటీవల కాలంలో బుల్లితెర నటులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బాలీవుడ్ లో టాప్ లో ఉన్న వాళ్లు కూడా ఏదో ఒక కారణంతో అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవల కుషాల్ అనే నటుడు ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా మరో నటి ఆత్మహత్య చేసుకుంది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ అనే సీరియల్‌లో నటించిన సెజల్ నిన్న రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని సెజల్ సహ నటుడు అరు వర్మ మీడియా ద్వారా వెల్లడించారు.
‘అవును సెజల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ చేదు విషయాన్ని నేను కూడా నమ్మలేకపోతున్నాను. పదిరోజుల క్రితమే నేను తనని కలిశాను. మొన్న ఆదివారం మేమిద్దరం వాట్సాప్‌లో చాటింగ్ కూడా చేసుకున్నాం. గత నాలుగు నెలల్లో నేను తనని కలవలేకపోయాను. అందుకే పది రోజుల క్రితం కలిశాను. అప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. నిన్న రాత్రి సెజల్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబానికి ఈ విషయం ఉదయం తెలిసింది. తన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ఉదయ్‌పూర్ తీసుకెళ్లారు’ అని తెలిపారు.
ఎన్నో టీవీ ప్రకటనల్లో, వెబ్ సిరీస్‌లలో నటించిన సెజల్ దూరం అవ్వడంతో హిందీ బుల్లి తెర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉంది కానీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయినట్లు చెబుతున్నారు. ఉదయపూర్ నుండి 2017లో ముంబై వచ్చిన సెజల్ శర్మ టీవీ నటిగా కొనసాగుతున్నారు. సెజల్ శర్మ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.