నీ తలవెంట్రుకల కంటే .. నా సంపాదన ఎక్కువ..
By Newsmeter.Network Published on 23 Jan 2020 2:22 PM GMT
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడో 2016లో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.
అసలేం జరిగింది..?
2016 లో ఓ ఇంటర్య్వూలో షోయబ్ అక్తర్ గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. అక్తర్ తన వ్యాపారాన్ని విస్తరించడం కోసమే టీమిండియాను భారత క్రికెటర్లను పొగుడుతున్నాడని అన్నాడు. ‘భారతీయులకి దగ్గరయ్యేందుకు షోయబ్ అక్తర్ చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే..? అతను భారత్‌లో వ్యాపారాలు ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా అతను భారత్‌తో స్నేహపూర్వక ధోరణిలో మాట్లాడుతుండటానికి కారణమిదే. మీరు ఒకటి గమనించారా..? షోయబ్ అక్తర్ క్రికెట్ ఆడే రోజుల్లో ఎప్పుడు కూడా భారత్ గురించి మంచిగా మాట్లాడలేదు’ అని వెల్లడించాడు
ఇదిలా ఉంటే అప్పుడెప్పుడో సెహ్వాగ్ అన్న మాటలపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో స్పందించాడు పాకిస్థాన్ కు చెందిన ఈ మాజీ ఫాస్ట్ బౌలర్. నీ తలపై ఉన్న వెంట్రుకల కన్నా నా వద్ద ఎక్కువ డబ్బు ఉంది. నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారూ అది తెలుసుకో ముందు. నా వ్యాఖ్యలకి అందరూ ప్రాధాన్యం ఇస్తుంటారూ.. నేను మాట్లాడితే బ్రేకింగ్ న్యూస్ గా మారిపోతున్నాయి అందుకు సంతోషంగా ఉంది. నేను టీమిండియాను విమర్శించింది ఎప్పుడంటే.. ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డేలో ఓడినప్పుడు మాత్రమేనని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో ఓడిన టీమిండియా తరువాత జరిగిన రెండు వన్డేల్లో గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ సిరీస్ ను 'గర్వించదగ్గ యుద్దం'గా అక్తర్ అభిప్రాయ పడ్డాడు.
ఇదిలా ఉంటే.. క్రికెట్ ఆడే రోజుల్లో షోయబ్ అక్తర్ బౌలింగ్ ను సెహ్వాగ్ చీల్చి చెండాడేవాడు. ఇద్దరూ మైదానంలో పోటీపోటిగా తలపడినప్పటికి ఎప్పడూ హద్దులు దాటలేదు. ఓ మ్యాచ్‌లో అక్తర్ బౌలింగ్ సమయంలో బంతి విసిరి అనంతరం పట్టుజారి కిందపడిపోగా సెహ్వాగ్ చేయి అందించి మరీ అతడ్ని పైకి లేపాడు