ఓవైసీ సభలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. కేసు నమోదు
By సుభాష్
బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన సభలో ఓ యువతి హల్‌చల్ చేసింది. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకంగా జరిగిన సభకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే వేదికపై వచ్చిన ఓ మహిళ 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. బెంగళూరు ఫ్రీడం పార్కులో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అమూల్య అనే యువతి అకస్మాత్తుగా వేదికపై వచ్చి మూడు సార్లు ఈ నినాదాలు చేయడంతో అసదుద్దీన్ ఓవైసీతో పాటు అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఓవైసీ ఆ యువతి చేతిలో ఉన్న మైక్‌ను లాక్కునేందుకు ప్రయత్నించగా, ఆమె వెంటనే 'హిందుస్థాన్ జిందాబాద్'అంటూ నినాదాలు చేసింది. ఇలా నినాదాలు చేసిన యువతిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 124 కింద కేసు నమోదు చేశారు. ఆమెను విచారించిన అనంతరం కోర్టులో హాజరు పర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇలా జరుగుతుందని తెలిస్తే సభకు వచ్చేవాడిని కాదు
ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. యువతి నినాదాలపై ఆయన క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటన జరుగుతుందని తెలిస్తే సభకు వచ్చేవాడిని కాదు.. మేం భారతీయులం.. శతృ దేశమైన పాకిస్తాన్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. భారత్‌ను కాపాడాలనేదే మా ఉద్దేశం అని అన్నారు. కాగా, ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలన్నీ పాక్, కాంగ్రెస్ నేతృత్వంలోని జాతి వ్యతిరేక శక్తుల మధ్య జాయింట్ వెంచర్‌లో భాగమని ఆరోపించింది. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ కూడా ఖండించింది.