దేశంలోకి కూడా కరోనా ప్రవేశించడం, ఇప్పటికే పలు కేసులు నమోదు కావడం వల్ల మన దేశమూ ఇప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఇటలీ, ఇరాన్ లనుంచి ప్యాసింజర్లు రాకుండా మన విమాన యాన సంస్థలు నిషేధాజ్ఞలు జారీ చేశాయి. కానీ అసలు సమస్య మనకు గల్ఫ్ దేశాల విమానాశ్రయాలనుంచే ఉంది. ఎందుకంటే మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారు, వచ్చే వారు ఎక్కువగా గల్ఫ్ దేశాల విమానాశ్రయాల్లో కాసేపు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ పలు దేశాల ప్రయాణికులు ఒకరినొకరు కలుసుకుంటారు. ఇక్కడ కనీసం రెండు మూడు గంటలు కలిసి ఉంటారు. కాబట్టి కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు తెహరాన్ నుంచి వచ్చే ఎనిమిది ఫ్లైట్లు దుబాయిలో ఆగుతాయి. అదే విధంగా రోమ్, వెనిస్, మిలాన్ నుంచి వచ్చే ఆరు విమానాలు దుబాయిలో ఆగుతాయి. వీటి వల్ల దాదాపు మూడు వేల మంది ప్రయాణికులు అక్కడ సమయం గడపవలసి వస్తుంది. ముంబాయి, దుబాయిల మధ్య పదిహేడు ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయి. దుబాయినుంచి ఢిల్లీ కి 12, కొచ్చికి ఏడు, హైదరాబాద్ కి ఆరు విమాన సర్వీసులు ఉన్నాయి. దుబాయి విమానాశ్రయానికి ఏటా 1.19 మిలియన్ల మంది భారతీయ ప్రయాణికులు వెళ్తూంటారు. దోహా, అబుధాబీ, బహ్రేన్, రియాధ్ వంటి విమానాశ్రయాలలోనూ భారతీయుల రాకపోకలు మామూలుగానే చాలా ఎక్కువ.

అసలు గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారు, వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో వారందరికీ స్క్రీనింగ్ చేయడం కూడా అంత సులువేం కాదు. వీరందరినీ పరీక్షించడానికి తగినంత సిబ్బంది కూడా లేరు. రోజూ వేల మంది ప్రయాణికులను స్క్రీన్ చేయడం అంటే మాటలు కాదు.

ఇవన్నీ చాలవన్నట్లు జపాన్, దక్షిణ కొరియా, ఇటలీలనుంచి వచ్చే ప్రయాణికులందరినీ స్క్రీన్ చేసి, వారికి కరోనా వైరస్ లేదని రూఢి చేసుకున్నాకే భారత్ లోకి రానీయాలని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు వైపు నుంచి వచ్చే వారికి ఇప్పటికే స్క్రీనింగ్ జరుగుతోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.