రెండో చందమామ.. రేపట్నుంచే అద్భుత దృశ్యం
సెప్టెంబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 25 వరకూ రెండో జాబిల్లి కనిపించనుంది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 2:36 PM IST
రెండో చందమామ.. రేపట్నుంచే అద్భుత దృశ్యం
సెప్టెంబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 25 వరకూ రెండో జాబిల్లి కనిపించనుంది. పీటీ5 గ్రహశకలం భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. ఈ సమయం తర్వాత భూ గురుత్వాకర్షణ నుంచి విడిపోయి, తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోనుంది ఈ గ్రహశకలం. రెండో చంద్రుడుగా పిలుస్తోన్న పీటీ5 గ్రహశకలం చాలా ఎత్తులో ఉంటాడట. చిన్నగా ఉండటం వల్ల కళ్లతో కానీ.. చిన్న టెలిస్కోప్‌తో గానీ చూడలేమని చెబుతున్నారు. పెద్ద టెలిస్కోప్‌ల ద్వారా మాత్రమే చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహ శకలం 33 అడుగుల పొడవు.. వెడెల్పు 138 అడుగుల వరకు ఉంటుందట. రష్యాలో 2013లో పేలిన గ్రహశకలం కన్నా కాస్త పెద్దదని చెబుతున్నారు. కొందరు దీని వల్ల ఏదైనా నష్టం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆందోళనలు అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. దీని ద్వారా కలిగే ముప్పేమీ లేదనీ.. భూమిని ఢీకొట్టే అవకాశం అస్సలు లేదంటున్నారు.
సాధారణంగా భూ గురుత్వాకర్షణను తప్పించుకోలేక, కొద్దికాలం ప్రదక్షణ చేసే గ్రహ శకలాలను ‘మినీ మూన్స్’ అంటారు. ఇవి చిన్నగా ఉండటం, అతి వేగంగా కదలటం వల్ల వీటిని గుర్తించటం కష్టం గా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్నిసార్లు కృత్రిమ వస్తువులు కనిపించినా.. గ్రహశకలాలే అంటూ ఉందంతాలు వచ్చాయి. రాకెట్ల అవశేషాలూ కూడా ఇలానే తలపిస్తుంటాయి. కానీ 2024 పీటీ5 మాత్రం అలాంటిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖగోళ వస్తువు అనటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. కాగా.. ఆగస్టు 7న.. 2024 పీటీ5ను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.