భూమిపై కంటే చంద్రుడిపై ప్రకంపణలు ఎక్కువేనా..?

భూమిపై సంభవించినట్లుగానే చంద్రుడిపై కూడా ప్రకంపణలు వస్తాయా? దీనిపై అంతరిక్ష పరిశోధకులు వివరణ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  10 Sept 2023 1:45 PM IST
Moon vibrations,  20 times high,  earth, Astronauts,

 భూమిపై కంటే చంద్రుడిపై ప్రకంపణలు ఎక్కువేనా..?

భూమిపై అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. తాజాగా మొరాకోలో పెను భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపంలో 2వేల మందికి పైగా చనిపోయారు. గాయపడ్డవారి సంఖ్య కూడా వేలలో ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించాయి. అయితే.. అవి స్వల్పమైనవి కావడంతో ప్రమాదాలు జరగలేదు. భూమిపై సంభవించినట్లుగానే చంద్రుడిపై కూడా ప్రకంపణలు వస్తాయా? అక్కడ తీవ్రత ఎలా ఉంటుంది అనే దానిపై అంతరిక్ష పరిశోధకులు వివరణ ఇచ్చారు.

భూమితో పోలిస్తే భౌగోళికంగా చంద్రుడి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. అక్కడ కూడా ప్రకంపణలు సంభవిస్తాయని వివరిస్తున్నారు. ఒక్కోసారి వాటి తీవ్ర భూమిపై కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇటీవల చంద్రుడి ఉపరితలంపై భారత్‌కు చెందిన విక్రమ్ ల్యాండర్‌చంద్రుడిపై ప్రకంపణలకు సంబంధించిన సంకేతాలను గుర్తించిందని చెప్పారు. గతంలో అమెరికాలో చేపట్టిన అపోలో 17 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ కొన్ని సిస్మోమీటర్లను వదిలి వచ్చారనీ.. అవి కేవలం ఐదేళ్ల మాత్రమే పనిచేశాయని చెప్తున్నారు. ఐదేళ్లలో చంద్రుడిపై సుమారు 12వేలకు పైగా ప్రకంపణలు నమోదు అయ్యినట్లు నాసా వెల్లడించింది. ఈ సిస్మోమీటర్లు అందించిన సమాచారం ఆధారంగా చంద్రుడిపై నాలుగు రకాల భూకంపాలు సంభవిస్తాయని కనుగొన్నట్లు తెలిపింది.

చంద్రుడిపై అత్యంత లోతైన ప్రకంపణలు సాధారణమని, ఇవి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు సంభవిస్తాయని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. చంద్రుడిపై ఉల్కలు ఢీ కొనడం, ఉపరితలంపై ఉష్ణోగ్రతలలో కలిగే మార్పులు తదితర కారణాల వల్ల భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 పాయింట్లుగా నమోదైందని తెలిపారు. ఈ భూకంపాలు 10 సెకండ్ల నుంచి 30 సెకండ్లు ఉంటాయని చెప్పారు అంతరిక్ష పరిశోధకులు.

Next Story